ధనబలానికి... జనబలానికి మధ్య పోటీ

by Disha Web Desk 15 |
ధనబలానికి... జనబలానికి మధ్య పోటీ
X

దిశ, కౌడిపల్లి : మెదక్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథకంలో తీసుకెళ్లిన దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసునిగా మీ బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డనైన తనను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. గురువారం నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలంలో కంచనపల్లి, పాంపల్లి, ధర్మసాగర్ గ్రామాల మీదుగా నిర్వహించిన రోడ్ షో లో నీలం మధు ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు రవీందర్ రెడ్డి, శేషసాయిరెడ్డి, శ్రీనివాస్ గుప్తాలతో కలిసి పాల్గొన్నారు. రోడ్ షో కౌడిపల్లి కి చేరుకుంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రోడ్ షోలో భారీగా పాల్గొని ఘన స్వాగతం పలికారు.

కౌడిపల్లిలో నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ధన బలంతో హరీష్ రావు పిచ్చిపిచ్చిగా వాగుతున్నారని అన్నారు. బిడ్డ హరీష్ రావు నోరు జాగ్రత్త లేదంటే మా కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. తాను బలహీన వర్గాల బిడ్డగా సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వస్తే మల్లన్న సాగర్ లో గ్రామాలను ముంచి కోట్ల రూపాయలను కొల్లగొట్టి డబ్బు మదంతో మీ పార్టీ అభ్యర్థి ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మెదక్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, తన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానన్నారు.

ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తనకు తీరని అన్యాయం చేసి మోసం చేశాడని అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు నర్సాపూర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇచ్చి తీరుతానని అన్నారు. ఆవుల రాజిరెడ్డి తదితరులు ప్రసంగించారు. అంతకుముందు ధర్మసాగర్ గేటు నుంచి కౌడిపల్లి వరకు రోడ్ షోకు జనం నీరాజనాలు పలికి ఘన స్వాగతం పలికారు. మహిళలు నృత్యాలు చేశారు. యువకులు బాణాసంచా కాల్చారు. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్... రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.



Next Story

Most Viewed