రూ.20 కోట్లు పెడితే నేనే ఎమ్మెల్యే..!

by Disha Web Desk 12 |
రూ.20 కోట్లు పెడితే నేనే ఎమ్మెల్యే..!
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్​ అసెంబ్లీ సీటు మరీ ఈజీగా మారిందా. డబ్బుంటే అందరిని కొనిపడేసి ఎమ్మెల్యే అయిపోవచ్చా..! అవును ఇప్పుడు ఓ బీఆర్ఎస్​వీ నేత ఫోన్​లో జరిపిన సంభాషణ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతూ చర్చనీయాంశంగా మారింది. టిక్కెట్​ వస్తే నాకు రూ.20 కోట్లు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. రూ.20 కోట్లు పెడితే నేను ఎమ్మెల్యేగా గెల్వనా. అందరిని కొని పడేస్తా.. కుల సంఘాలు, లీడర్లకు ఇచ్చిపడేస్తా అంటూ బీఆర్​ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసిన ఫోన్​ సంభాషణ సోషల్​ మీడియాలో హాట్​టాపిక్​గా మారింది.

ఎవరీ కొత్త లీడర్​ అంటూ ఆరా తీస్తున్నారు. ఏ ఉద్దేశంతో అన్నాడు.. ఆ లీడర్​ వెనుక ఎవరున్నారనే చర్చ జిల్లాలో సాగుతోంది. ఉస్మానియాలో విద్యనభ్యసించిన సతీష్ ​రెండేళ్ల క్రితం బీఆర్​ఎస్వీ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమయ్యాడు. స్థానికంగా అంతగా ప్రభావం లేని ఇతను కొంతకాలంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి తో కలిసి తిరుగుతున్నాడు. సతీష్​ చేసినట్లుగా వచ్చిన వాయిస్ కాల్ పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు

20 కోట్లు పెట్టడానికి రెడీగా ఉండ్రు తమ్మి..

‘భవిష్యత్తులో నాకు సపోర్ట్ చేయడానికి టీం సిద్ధంగా ఉంది...ఎమ్మెల్యే టికెట్ వస్తే 20 కోట్లు పెట్టేందుకు రెడీగా ఉన్నారు.. టిక్కెట్ వస్తేనే పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. టిక్కెట్ రాకుంటే ఎవరూ ఇవ్వరు అది కూడా చెబుతున్న.. నాకు ఉండే సర్కిల్‌ను నేను ఏర్పరచుకుంటా... రూ.20 కోట్లు పెడితే ఎమ్మెల్యే‌గా గెల్వనా. అందరినీ కొనేస్తా. కుల సంఘాలు ఇస్తా, లీడర్ కు ఇచ్చేస్తా తిరగరా నా వెంటా అంటే చెబుతున్న.. రాజకీయంగా తెలివి ఉండాలి, అంగబలం, ఆర్థిక బలం ఉండాలి. స్టేట్ కమిటీ అని లోకల్‌గా రుబాబు కొట్టలేదు. ఏ ఎప్పుడైనా కొట్టానా. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నాకుండే స్థాయి నాకు ఉంటది. నాది ఎమ్మెల్యే పక్కన కూర్చునే స్థాయి కానీ కూర్చుంటానా.. సర్పంచ్ నీ కూడా అన్నా అని పిలుస్తాను అనే వాయిస్ కాల్ రికార్డు వైరల్ గా మారింది.

వెనుక ఉన్నది ఎవరు..?

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాయిస్ కాల్ రికార్డు మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. ఇప్పటికే మెదక్ లో మూడు ముక్కలాట సాగుతుంది.. స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉండగా.. ఎమ్మెల్సీ సుభాశ్ ​రెడ్డి టికెట్ రేసులో నేను ఉన్నానంటూ నియోజక వర్గంలో మకాం వేసి ప్రజల్లో తిరుగుతున్నారు.. ఇద్దరి మధ్య బీఆర్​ఎస్​ టికెట్ ఎవరికి వస్తుందన్న అయోమయంలో నేతలు, ప్రజలు ఉండగా వారసుడు వస్తున్నాడంటూ మైనం పల్లి రోహిత్‌ను రంగంలోకి దించారు. మైనంపల్లి హనుమంతరావు.. ఇటీవలే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు.

ముగ్గురి మధ్య చర్చ సాగుతున్న తరుణంలో పడాల సతీష్ ​పేరుతో వచ్చిన వాయిస్ కాల్ రికార్డు మరింత గందరగోళంలో పడేసింది. రాష్ట్ర స్థాయి పదవిలో ఉండడంతో అలా మాట్లాడారా. లేక తెర వెనుక రాజకీయ అండ ఏమైనా ఉందా.. అనే కోణంలో జిల్లాలో చర్చ సాగుతోంది. దీని వెనకాల ఎవరు ఉండి ఉంటారు. రూ.20 కోట్లు ఇచ్చే స్థాయి కలిగిన వారంటే ఆలోచించాల్సిన అంశమే అంటున్నారు ప్రజలు. మాటల తీరు.. చెప్పే విధానం చూస్తే పక్కా పథకం ప్రకారమే వాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మెదక్ అంతా ఈజీనా..!?

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసిన వాఖ్యలు మెదక్‌లో గెలుపు అంతా సులభమా అనే విధంగా ఉంది.. గతంలో నేతలు అనుసరించిన కుల సంఘాలు, నేతలను కొనేయడం చూస్తే తెర వెనుక ఎవరో ఉన్నారన్న అనుమానం కలుగుతుంది. ఎమ్మెల్యే సీటు పై దృష్టి లేకుండా సాధారణంగా ఎవరు ఇలాంటి వాఖ్యలు చేయరు.. కానీ ఇందులో లోగడ మర్మం ఉందన్న ప్రచారం సాగుతోంది.



Next Story

Most Viewed