సేవ చేసే వారిని ప్రోత్సహించేందుకే ‘మన్ కీ బాత్’: మంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 6 |
Kishan Reddy lashes out at TRS Flexi Politics
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడమే మన్ కీ బాత్ కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ ను స్థానిక ప్రజలతో కలిసి కిషన్ రెడ్డి వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో లక్షలాది ప్రాంతాల్లో కోట్లాది మంది మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారని ఆయన చెప్పారు. సుమారు 100 దేశాల్లోని భారతీయులు సైతం చూశారన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 100 చోట్ల, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 100 చోట్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 700కు పైగా ప్రాంతాల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

బిల్ గేట్స్ లాంటి వ్యక్తి కూడా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఇది ఒక పార్టీ కార్యక్రమమో, రాజకీయ పరమైన కార్యక్రమం కాదని ఆయన పేర్కొన్నారు. సామాజిక సేవ, సమాజంలో మార్పులు, ప్రజలు ఎలా ముందుకు వెళ్తున్నారో ప్రధాని వివరిస్తున్నారన్నారు. మణిపూర్ లో ఓ అమ్మాయి గురించి ప్రధాని మాట్లాడితే ఆ అమ్మాయి వ్యాపారం పెరిగిందని, చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్లాస్టిక్ వల్ల కాలుష్యం పెరిగిపోతోందని, హిమాలయాల్లో కూడా ప్లాస్టిక్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోందన్నారు. వాటిని క్లీన్ చేస్తున్న వారి గురించి సైతం మోడీ మన్ కీ బాత్ లో వివరించారన్నారు. దేశ ప్రజలు ప్రధానిని ఓ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.



Next Story

Most Viewed