మూడు నియోజకవర్గాల్లో ఒకలా.. ఆ నియోజకవర్గంలో మరోలా..!!

by Disha Web Desk 12 |
మూడు నియోజకవర్గాల్లో ఒకలా.. ఆ నియోజకవర్గంలో మరోలా..!!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: అసెంబ్లీ నియోజకవర్గాలకు... బాస్‌లు ఎమ్మెల్యేలే.. వారి ప్రమేయం లేకుండా ఎవరూ తిరగడానికి వీలు లేదు.. అని అధికార బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠాన ఆదేశాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందుకు భిన్నంగా అమలు అవుతున్నాయి.. మూడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఎంపీ, ఎమ్మెల్సీలు ఎవరూ పర్యటనకు వెళ్లొద్దని సూచనలు చేసిన అధిష్టానం.. మరో నియోజకవర్గం విషయంలో మాత్రం మరోలా సూచనలు చేసినట్లు చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఆ నియోజకవర్గంలో.. ఎమ్మెల్సీ, ఓ కార్పొరేషన్ చైర్మన్ కార్యక్రమాలకు హాజరవుతుండడం సరికొత్త చర్చకు దారితీస్తోంది.. ఆ మూడు నియోజకవర్గాలు కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట అయితే.. ఆ ఒక్క నియోజకవర్గం అలంపూర్.

అక్కడ ఎమ్మెల్యే తో కలిసి కార్యక్రమంలో పాల్గొనాలి..

ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో పాటు బాధ్యత ఉన్న ప్రజా ప్రతినిధులు.. వీలును బట్టి వారు వారి వారి నియోజకవర్గాల్లో పర్యటనలు చేసే అవకాశాలు ఉంటాయి.. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి, నాగర్ కర్నూల్‌లో మరో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, అచ్చంపేటలో ఎంపీ రాములు తనయుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్, తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆయా నియోజకవర్గాల్లో అడపాదడపా ఎంపీ రాములు పర్యటన చేసేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వారు పోటీ ఎక్కడ అవుతారనే సందేహం తో తమతో సంబంధం లేకుండా ఎంపీ, ఎమ్మెల్సీలు తిరుగుతున్నారు.

దీనివల్ల తాము ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొన్ని నియోజకవర్గాలలో ఇదే విధమైన సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల బాస్‌లు .. వారితో కలిసి కార్యక్రమాలకు వెళ్లాలి. వాళ్ళు రాని ఎడల వారి దృష్టికి తీసుకువచ్చి అభ్యంతరాలు లేకపోతే కార్యక్రమాలలో పాల్గొనాలి తప్ప ఎంపీలు, ఎమ్మెల్సీలు అధికారిక కార్యక్రమాలకు హాజరు కావద్దు అని ఆదేశాలు జారీ చేయడంతో.. ఎంపీ, ఎమ్మెల్సీల పదవులు అలంకారప్రాయంగా మిగిలాయి. ఈ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలే తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటున్నారు.

ఆ ఒక్క నియోజకవర్గంలో..

ఉమ్మడి జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పరిస్థితులు ఇలా ఉంటే.. అలంపూర్ నియోజకవర్గ పరిస్థితులు ఎందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.. అక్కడ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి ఒకవైపు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయికుమార్ మరోవైపు పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు.. దీంతో ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అసహనానికి గురవుతున్నారు.. ఆయన అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఈ విషయంపై దృష్టిని సారించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ఉన్న విభేదాలను తొలగించి కలిసికట్టుగా ముందుకు సాగే విధంగా చేయడంతో పాటు.. నియోజకవర్గానికి సంబంధించిన నిర్ణయాలు ఎమ్మెల్యే ఆమోదంతో జరగాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Read more:

బిగ్ న్యూస్: BRS ఎమ్మెల్యేలకు ఎలక్షన్ కౌంట్ డౌన్ స్టార్ట్!...రంగంలోకి KCR.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బిగ్ ప్లాన్....అత్యవసరంగా ఎల్పీ, కేబినెట్ భేటీ వెనుక కారణం అదే..?

Next Story

Most Viewed