పాలమూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
పాలమూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: పాలమూరు పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రూ. 276 కోట్ల నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్. వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ.. ఇటీవలే మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ కు వచ్చినప్పుడు, పాలమూరు మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మంజూరు చేయాలనే విజ్ఞప్తి మేరకు, తక్షణమే 276 కోట్ల రూపాయలను విడుదల చేశారని, అందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ మంత్రిని కోరడం జరిగిందని, దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన 276 కోట్ల రూపాయలతో పెద్ద చెరువు వద్ద 3 ఎస్ఎఫ్టీటీసీ లతో పాటు, ట్రంక్ మెయిన్స్ ల నిర్మాణం చేపడతామని, ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులను సంవత్సరంలోపు పూర్తవుతాయని, ఈలోగా పెద్ద చెరువులోకి వచ్చే వర్షపు నీటిని బయటికి వెళ్లేందుకుగాను తగిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లను ఆదేశించారు. ఉదండపూర్ రిజర్వాయర్ నుంచి పెద్ద చెరువులోకి నీటిని నింపేలా చర్యలు తీసుకుంటామని, అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు.

ఇందుకుగాను అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పెద్ద చెరువులో ప్లాట్లు కోల్పోయిన వారికి ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా, అదే విధంగా ఏనుగొండ రహదారి విస్తరణలో ఇండ్లు, స్థలాలు పోయిన వారికి, జర్నలిస్టులు తదితరులకు పట్టాలు పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన స్టేడియం పనులను జూన్ లోపు పూర్తి చేయాలని జూన్ లో జాతీయస్థాయి టోర్నమెంట్లు ఆడే అవకాశం ఉన్నందున వాటిని ఇక్కడే ఆడే విధంగా అధికారులు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

సైనేంట్ కంపెనీ ద్వారా జిల్లాలో నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన నేపధ్యంలో, త్వరలోనే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కె.తారక రామారావు జిల్లాకు రానున్నారని, అదే రోజున సైనేంట్ కంపెనీ ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తో పాటు,పెద్ద చెరువు వద్ద నిర్మించే డ్రైనేజ్, ట్రాఫిక్ సిగ్నల్స్, వైకుంఠధామం తదితర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీఓ అనిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, హుడా చైర్మన్ గంజి వెంకన్న, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ ఇంజనీర్లు నరేందర్ రెడ్డి, సుబ్రమణ్యం స్వామి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.



Next Story

Most Viewed