అవినీతికి అడ్డాగా ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయం..

by Disha Web Desk 11 |
అవినీతికి అడ్డాగా ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయం..
X

దిశ, ఉప్పునుంతల: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పనులు జరగవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారుల వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొరటికల్ గ్రామానికి చెందిన గుడ్ల నర్వ జంగయ్య అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఆ విషయాన్నితెలుసుకున్న రెవెన్యూ అధికారులు మామూళ్లకు ఆశపడి సర్వేనెంబర్ 145/ఆ/1 ఆరు ఎకరాల 20 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ల నుంచి మామూలు తీసుకొని నిజమైన అర్హులకు అన్యాయం చేశారని బాధితులు వాపోయారు.

పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారిని అధికారులు, సిబ్బంది నెలల తరబడి తిప్పుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సకాలంలో పనులు జరగక విసుగుచెందిన వారు కార్యాలయంలో ఎంతో కొంత ముట్టజెప్పి తమ పనులు చేయించుకుంటున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా అక్రమంగా భూముల పట్టాలను అటు ఇటుగా మార్పిడి చేస్తూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఏది ఏమైన అక్రమ సంపాదనే ధ్యేయంగా అధికారులు కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది. అక్రమాలకు తోడు భూముల ధరలు ఆకాశానికి తాకడం వారికి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కార్యాలయానికి వచ్చే మధ్యవర్తుల ద్వారా సైతం అధికారులు రాయబారం నడుపుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేటతెల్లం అవుతుంది.

కార్యాలయంలో ఓ అధికారి గత కొంత కాలం నుంచి ఇక్కడే తిష్టవేసి అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారారని తెలుస్తోంది. సదరు అధికారి ఎక్కడ పనిచేసిన ఇదే వ్యవహారం ఉంటున్నట్లు ప్రజలు బాహాటంగానే చర్చించుకోవడం గమనార్హం. కాగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులను ఇక్కడి నుంచి తప్పిస్తేనే కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టవచ్చనే అభిప్రాయం మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అవినీతి అక్రమాల బాగోతంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed