వనపర్తిలో కారుకు ఎదురెళ్తున్న బీఆర్ఎస్ నేతలు

by Dishanational1 |
వనపర్తిలో కారుకు ఎదురెళ్తున్న బీఆర్ఎస్ నేతలు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వనపర్తి జిల్లా భారతీయ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)లో అసమ్మతి సెగలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఎక్కడ చూసినా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజం. కానీ అధికార పార్టీలో తలెత్తే విభేదాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ప్రత్యేకించి వనపర్తి జిల్లాలో గత కొన్ని నెలలుగా సాగుతున్న వ్యవహారాలు మంత్రి వర్సెస్ జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డి మధ్య సాగుతోంది. మంత్రి అండదండలతోనే వీరు ఇరువురు పదములను అలంకరించినప్పటికీ పేరుకే పదవులు కానీ మాకు ప్రొటోకాల్ విధానంలో ప్రాధాన్యం ఎక్కడ ఇస్తున్నారంటూ ఆరోపిస్తూ గత కొంతకాలంగా జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డితోపాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు తమ అసంతృప్తి స్వరాలను అక్కడక్కడ వినిపిస్తూ వస్తున్నారు. ఆ మధ్య జరిగిన ఓ సమీక్షా సమావేశంలో జిల్లా పరిషత్ నిధులు, తదితర అంశాలకు సంబంధించి మంత్రి నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని అధికారుల ముందే మంత్రిపై తన అసహనాన్ని ప్రదర్శించారు.

మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య వాదనలు కూడా జరగడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డి సైతం తిరుగుబాటు జండా ఎగరవేస్తున్నారు. ఇటీవల మెగారెడ్డి అనుచరుడు శివ అనే వ్యక్తి మంత్రికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో ఓ వీడియోను షేర్ చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహరంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి శివను అరెస్టు చేశారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ సామాజిక మాధ్యమాలలో ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శివ పై పోలీసుల ప్రతాపాన్ని నిరసిస్తూ పలు సంఘాల నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. ముఖ్య నేతలు ఈ అంశాలపై నోరు మెదపకపోయినప్పటికీ సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారాల వెనక ఆ నేతల అభిప్రాయాలే దాగి ఉన్నాయని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న శివ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం పలువురు ప్రజాప్రతినిధులు పెద్దమందడికి వస్తున్నట్లు సమాచారం. తన నియోజకవర్గానికి దాదాపుగా ప్రతి మండలానికి సాగునీరు అందించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలలోనూ తన వంతు పాత్రను పోషించిన మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు బయటకు వస్తుండడం అధికార పార్టీ శ్రేణుల్లో పలు రకాలుగా చర్చలు సాగుతున్నాయి. వచ్చే రెండు మూడు వారాలలో వనపర్తి అధికార బీఆర్ఎస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పార్టీ మారుతారా..!?

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రిని వ్యతిరేకిస్తున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డి తదితరులపై అవిశ్వాస తీర్మానం పెట్టి పక్కకు తప్పించాలనుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో అసంతృప్తి సెగలు బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా వారికి నచ్చచెప్పి పార్టీలో కొనసాగే విధంగా చేయాలని అధిష్ఠానం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వారికి వారుగా తమ పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళతారని, కొందరు.. ఇదే పార్టీలో కొనసాగుతారని మరికొందరు అంటున్నారు. మొత్తం పై వచ్చే నెలలో వనపర్తి జిల్లాల్లో అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా మార్పులు చేర్పులు తప్పకుండా ఉంటాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story

Most Viewed