చెరబట్టారు..‘సిరిసంపదల' కోసం చెరువుకు గండి

by Dishanational2 |
చెరబట్టారు..‘సిరిసంపదల కోసం చెరువుకు గండి
X

దిశ ప్రతినిధి మహబూబ్ నగర్/ జడ్చర్ల: అడ్డంగా ‘ సిరి సంపదలు’ కొల్లగొట్టడానికి నీటితో ఉన్న చెరువుకు గండి కొట్టి చేతికి వచ్చిన వరి పంటను నీటిపాలు చేశారు రియల్ వ్యాపారులు. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి గ్రామ శివారు మల్లెబోయినపల్లి గ్రామ సమీపంలో సర్వేనంబర్ 102, 117లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమిని కొనుగోలు చేసి 'సిరి సంపదలు' పేరుతో వెంచర్ చేశారు. పచ్చని బయళ్లు, అటవీ ప్రాంతం, చెరువు శిఖరంతో ఉండే ఈ ప్రాంతాన్ని రియల్ వ్యాపారులు వెంచర్‌గా మార్చేశారు. ఈ వెంచర్ చేయడం కోసం పట్టా భూమితో పాటు.. కొంత అసైన్మెంట్ ల్యాండ్ కు సైతం ఉన్నతాధికారుల సహాయ సహకారులతో ఎన్‌వోసీలు తెచ్చి వెంచర్ గా చేశారు. ఈ వెంచర్ లో మూడున్నర ఎకరాల శిఖం భూమి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి..

వెంచర్ కింది నుంచి పాలమూరు -రంగారెడ్డి సొరంగ మార్గం:

సిరిసంపదలు వెంచర్ అడుగు భాగం నుంచి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కరివేన రిజర్వాయర్ నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు టన్నెల్ (సొరంగ మార్గం) వెళ్లింది. నిబంధనల ప్రకారం సొరంగ మార్గాలు ఉన్న భూభాగంలో వెంచర్లు చేయడానికి అనుమతులు ఉండవు. కానీ ఈ వెంచర్ కు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల వెంట అధికార, ధన బలం ఉన్న నేతలు ఉండడం వల్లే ఇది సాధ్యం అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదులు వెళ్లిన స్పందించని అధికారులు:

సిరిసంపదలు వెంచర్ కు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాసంఘాల నాయకుల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించడంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పక్కన ఉన్న ప్రభుత్వ భూములు, గుట్టలను కూడా ఆక్రమించుకుంటూ వెంచర్లు చేస్తున్నారు. సిరిసంపదలు వెంచర్ అడుగుభాగం నుంచి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి సొరంగ మార్గం ఉంది.. ఈ సొరంగం పై ఎలా వెంచర్ చేస్తారు అని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినప్పటికీ.. అధికారులు స్పందించకపోవడం తో రియల్ వ్యాపారులు ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మరి కొంతమంది అధికారులు చేతులు తడవగానే తమకు ఏమీ పట్టదు అన్నట్లు ఉంటున్నారు.

చెరువును తెంచేశారు..

సిరిసంపదలు వెంచర్ కు సమీపంలో ఉన్న చిన్న చెరువు వల్ల ఇబ్బందులు ఎదురు కావడంతో సంబంధిత వ్యాపారుల ఆదేశాలతో కొంతమంది సిబ్బంది చెరువు కట్టను తెంచి వేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తెగిన ఈ చెరువు నీరు పెద్ద ఎత్తున రావడంతో చెరువు దిగువ భాగంలో ఉన్న దాదాపుగా 30 ఎకరాల మేరా వరి పంటకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వెంచర్ ఏర్పాటు అవుతున్నది నిబంధనలకు విరుద్ధంగా.. ఆపై చెరువు తెంచి మాకు నష్టం కలిగిస్తారా..!? అంటూ పలువురు రైతులు వెంచర్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.. మరోవైపు తాము పెంచుకున్న చేపలకు నష్టం జరిగిందని మత్స్యకారుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. సంబంధిత వెంచర్ వ్యాపారులకు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా వచ్చి.. అలా వెళ్లిన అధికారులు:

సిరిసంపదలు వెంచర్ నిర్వాహకుల కారణంగా చెరువు తెగిపోయిందని తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. చెరువు తెగిపోయిన విషయంపై, ఇతర ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed