దేవుళ్ల మీద కాదు.. మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టు వేయండి : డీకే అరుణ

by Disha Web Desk 23 |
దేవుళ్ల మీద కాదు.. మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టు వేయండి :  డీకే అరుణ
X

దిశ,మహబూబ్ నగర్ బ్యూరో : పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె స్వగృహంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మీరు ఎక్కడికి వెళితే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి ప్రజలకు హామీలు ఇవ్వకండి.. ఎందుకంటే దేవుళ్లపై మీకు నమ్మకం లేదు.. ప్రజలను నమ్మించాలి అనుకుంటే మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి హామీలు ఇవ్వాలి’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ..గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సిక్స్ గ్యారెంటీస్ ను డిసెంబర్ 9వ తేదీ లోపు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు పూర్తిస్థాయిలో ఒకటైన అమలు అయ్యాయా అని ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయా సందర్భాలలో ఇచ్చిన హామీలను డీకే అరుణ వినిపించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఆరు సార్లు పర్యటించావు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గంలో ఒక్కసారి పర్యటించాను అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఆరుసార్లు పర్యటించ వలసిన అవసరం ఏమొచ్చిందో రేవంత్ రెడ్డి చెప్పాలి అని డీకే అరుణ డిమాండ్ చేశారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఒక్కసారైనా బావోజీ జాతర కి వచ్చావా..!? ఎన్నికలు వచ్చాయి కదా అని ఇప్పుడు జాతరకు వచ్చి సేవాలాల్, బావోజీ మీద ఒకసారి.. మరోసారి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మీద.. జోగులాంబ సాక్షిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెబుతున్నావు.. ఇప్పటికే మీరు అబద్ధాలు చెప్పారన్న విషయం ప్రజలు గుర్తించారు. ఇంకా మోసం చేయాలని చూస్తే ప్రజలు సహించే పరిస్థితుల్లో లేరు అని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో మీ అభ్యర్థులు ఓడినంత మాత్రాన మీ కుర్చీకి డోకా ఏమీ ఉండదు.. ఉంది అనుకుంటే ఎందుకుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో దేశ ప్రధాని చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి.. మీకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఒకవైపు ప్రధానమంత్రిని.. మరోవైపు మమ్మల్ని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. అని డీకే అరుణ అన్నారు. అలా మాట్లాడిన కేసీఆర్ కు ప్రజలు ఏ విధమైన బుద్ధి చెప్పారో .. మీకు అదే విధమైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పాలమూరు అభివృద్ధి జరగాలన్న, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు తేవాలన్న ఈ అరుణమ్మ గెలవాల్సిందే అన్న నిర్ణయం ప్రజలు వచ్చారని ఆమె చెప్పారు. 14 పార్లమెంట్ స్థానాల్లో గెలిస్తే ముదిరాజ్ ఎమ్మెల్యే అయిన మక్తల్ శ్రీహరికి మంత్రి పదవి ఇస్తాను అంటున్నాడు. శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడానికి.. ఎన్నికలకు సంబంధం ఏమిటో సీఎం స్పష్టం చేయాలన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు మేలు జరగడంతో పాటు మన దేశం మోడీ పాలనలో సురక్షితంగా ఉంటుందని డీకే అరుణ చెప్పారు.

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత..

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్,నర్వ సింగిల్ విండో మాజీ చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గంధం సుమన్ మాదిగ, నియోజకవర్గ ఇన్చార్జి శేఖర్ మాదిగ తదితరులు బిజెపిలో చేరారు. వీరికి డీకే అరుణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు బురుజు రాజేందర్ రెడ్డి, పాండురంగారెడ్డి, అంజయ్య, యాదయ్య, కృష్ణ వర్ధన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు



Next Story

Most Viewed