నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించలే.. ఆదే వచ్చింది: ఎమ్మెల్యే అబ్రహం

by Dishanational1 |
నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించలే.. ఆదే వచ్చింది: ఎమ్మెల్యే అబ్రహం
X

దిశ, అలంపూర్: అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా.. ప్రజా సేవే లక్ష్యంగా పాలన చేస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. అబ్రహం అన్నారు. ఏ రోజు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని ఏ పార్టీలో అడగలేదని, దేవుడు వరమిచ్చాడు నాయకుడు రమ్మని పిలవడంతోనే ఈరోజు ఎమ్మెల్యేగా విధులు నిర్వహించి ప్రజాసేవ చేసే భాగ్యం లభించిందని ఎమ్మెల్యే వి.ఎం. అబ్రహం అన్నారు. మంగళవారం మానవపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో బుడగ జంగాల కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం హాజరయ్యారు. ముందుగా గ్రామ సర్పంచి లక్ష్మిదేవి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా స్వాగతించారు. వరదలు వచ్చి 13 ఏళ్లు గడిచిపోయినా తమ గ్రామానికి నూతన ఇండ్లు నిర్మాణం జరగలేదని, మహమ్మద్రు గ్రామం వైపు దృష్టి సారించాలని సర్పంచి ఎమ్మెల్యేను కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ... డాక్టరుగా 40 సంవత్సరాలు వైద్య సేవలు అందించానని, ఏ రోజు డబ్బుల కోసం వారి జేబులు చూడలేదని, జబ్బు తగ్గుటకు సేవలు అందించానన్నాడు. ఎమ్మెల్యే టికెట్టు కావాలని ఏ పార్టీని ఆశించలేదని, తన కుమారుడు అజయ్ కూడా పదవులు, సీట్ల కోసం రాలేదని.. తనకు వెన్నంటి ఉండి ప్రజాసేవ చేస్తున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం నడుచుకుంటూ అలంపూర్ నియోజకవర్గ పాలన చేస్తున్నానని, టికెట్టు ఎవరికి ఇచ్చిన బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. రాబోయే రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కురువ వెంకటేశ్వర్లు, నాగేశ్వర్ రెడ్డి, కాంతారెడ్డి, రాంభూపాల్, శంకర్ గౌడ్ అనంతరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు నర్సింహులు నారాయణ, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Next Story