పాలమూరుకు మరో మణిహారం చించోలి హైవే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Dishafeatures2 |
పాలమూరుకు మరో మణిహారం చించోలి హైవే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: భూత్పూర్, వీరణ్ణపేట, టిడీగుట్ట మీదుగా నిర్మించనున్న మరో బైపాస్ హైవే రోడ్డు పాలమూరుకు మరో మణిహారంగా మారనున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్క్రతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భూత్పూర్ నుండి కోస్గి మీదుగా చించోలీ వరకు నిర్మించే హైవే పనులకు ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. భూత్పూర్ కోస్గి మీదుగా ముంబై వెళ్ళే వాహనాలకు ఈ హైవే తో 90 కి.మీ దూరం తగ్గనున్నదని, కేరళ, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి ముంబై వెళ్ళేందుకు ఈ హైవే ఎంతో ఉపయోగకరంగా ఉంటూ సమయం, ఇంధనం ఆదా అవుతుందని అన్నారు.

భూత్పూర్ నుండి పట్టణంలోని బైపాస్ రోడ్డు నిర్మాణం కోస్గి సమీపంలోని దుద్యాల గేట్ వరకు సుమారు 60 కి.మీ రోడ్డు పనులకు 475.74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఈ హైవే నిర్మించాలని ప్రజలు ఎవ్వరూ కోరలేదని, జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తామే ప్రతిపాదించినట్లు, ఈ పనులు పూర్తి అయితే పాలమూరు మరింత విస్తరించి ఎంతో అభివృద్ధి చెంది వీరన్నపేట,టీడిగుట్ట ప్రాంతాలకు మహర్థశ పట్టనున్నట్లు ఆయన వివరించారు.

దివిటిపల్లిలో ఐటి టవర్ పనులు చివరి దశకు చేరుకున్నాయని త్వరలో ఐటి మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించి, కాలుష్య రహిత లిథియం గిగా పరిశ్రమ ను స్థాపించి వేలాది మందికి ఉపాది అవకాశాలను కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మెన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మెన్ గణేష్, మార్కెట్ కమీటి వైస్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి, రోడ్డు నిర్మాణ సంస్థ ఎస్ఆర్సిసీ ఎండీ రాము, జీఎం దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story