అందరి చూపు పాలమూరు వైపే.. ఉమ్మడి జిల్లాపై దృష్టి సారిస్తున్న ప్రధాన పార్టీలు

by Dishanational2 |
అందరి చూపు పాలమూరు వైపే.. ఉమ్మడి జిల్లాపై దృష్టి సారిస్తున్న ప్రధాన పార్టీలు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అందరూ ఉమ్మడి పాలమూరు జిల్లా పైన దృష్టి సారిస్తున్నారు. ఇక్కడ వచ్చే తీర్పు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది అన్న ఆలోచనో..మరి ఏమిటో కానీ.. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఈ జిల్లా నుంచి తమ తమ కార్యక్రమాలకు, ప్రచారాలకు పదును పెడుతున్నాయి. ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా జడ్చర్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా బీఆర్ఎస్ అగ్రనేతలు ఉమ్మడి జిల్లాలో వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్.. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందంటూ బీజేపీ.. భారత్ జోడో జోష్ తో పార్టీ పుర్వ వైభవం చాటుకునేందుకు కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది.

ఎన్నికలకు ఏడాది గడువున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా క్రియాశీలక రాజకీయాలకు ఆయా పార్టీలు శ్రీకారం చుట్టాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ప్రధాన రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జడ్చర్లలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సారథ్యంలో సాగుతున్న పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాలను గెలుచుకొని తీరుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజలంతా సహకరించాలని ఆయన చేసిన ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా.. మిగతా పార్టీలలో ఒకింత చర్చలకు తెరలేపాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో సహజంగానే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒకింత పట్టు సాధించుకునే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకూడదు అని ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. త్వరలో కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో ఆయన పర్యటించనున్నారు. నెల రోజుల క్రితం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గురువారం జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్ నగర్ లలో జరగనున్న కార్యక్రమాలకు హాజరవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వారం రోజుల తేడాలోపే ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన ఖరారు చేశారు. ఈనెల 6న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ను ముఖ్యమంత్రి కేసీ ఆర్ ప్రారంభించి భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దు అని... బీఆర్ ఎస్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని చెప్పుకొచ్చారు. ఈనెల 12వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి రానున్నారు. జోగులాంబ గద్వాల నియోజకవర్గానికి సమీపంలో ఉన్న అలంపూర్, వనపర్తి, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున సభను తరలించేలా గులాబీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి . ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభలలో విపక్ష పార్టీలు అభివృద్ధి చెయ్యవు.. ఒకవేళ ఆ పార్టీలు అధికారంలోకి వస్తే మన గతి అదోగ తి అవుతుందని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్లే ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి చెందింది అంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలు అన్నీ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలే కావడం.. వచ్చే ఎన్నికలలో ఈ సంఖ్య తగ్గకుండా జాగ్రత్త పడుతూ.. గులాబీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.

నాగర్ కర్నూల్ లో బీజేపీ బహిరంగ సభకు సన్నాహాలు

కర్ణాటక ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ శ్రేణులకు బూస్ట్ అప్ కలిగించేలా ఆ పార్టీ అధిష్టానం అడుగులు ముందుకు వేస్తుంది. ఇందులో భాగంగా ఈనెల నాల్గవ వారంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పార్టీ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి అన్న భావనను తొలగించేల పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డ , తదితర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పై పట్టు సాధించేలా భారతీయ జనతా పార్టీ అడుగులు ముందుకు వేస్తుంది.



Next Story

Most Viewed