అకాల వర్షంతో మిర్చి రైతుకు కన్నీళ్లే

by Disha Web Desk 12 |
అకాల వర్షంతో మిర్చి రైతుకు కన్నీళ్లే
X

దిశ, మానోపాడు: ఈ ఏడాది మిర్చి పంట ఆదుకుంటాదని అనుకునే‌లోపే అకాల వర్షంతో మిర్చి రైతుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు రోజుల పాటు వాతావరణంలో మార్పు చోటుచేసుకుని, సాయంత్రం అయ్యిందంటే చాలు ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షం కురవడం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మిర్చి కోతలు కోసి, కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసి ముద్దయింది. ప్రధానంగా మానోపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామాల్లో ఆరబెట్టిన పంట తడిసిపోయింది. అయితే కొందరు రైతులు వాతావరణ మార్పును గమనించక కల్లాల్లో మిర్చి పంటపై రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మిర్చి తడిసింది.

మరికొందరు రైతులు అప్రమత్తమై మిర్చి రాశులపై టార్పాలిన్లు, బరకాలు కప్పి, మిర్చి వర్షం బారిన తడవ కుండా రక్షించుకున్నారు. తడిసిన పంట రంగు మారి నాణ్యత కోల్పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మిర్చి పంటకు నల్లి తామర పురుగు ఆశించడంతో దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపింది. నల్లి తామర పురుగు దాడిలో మిగిలిన కాస్తో కూస్తో పంట చేతికొచ్చింది అనుకుంటే ఇప్పుడు అకాల వర్షం కురవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. మెన్నిపాడులో వడగళ్ల వాన కురిసింది. సుమారు 10 సెకన్ల పాటు వడగళ్ల వాన పడిందని స్థానికులు తెలిపారు.

ప్రభుత్వం సరఫరా చేయదా....అధికారులు చూడరా..!

ప్రతి ఏడాది పంటలు పండించుకుని గోదాములు లేక ఏటా పంట పొలాల్లోనే లేదా కళ్ళల్లోనే మిర్చిని కానీ ఇతర పంటలు ఆరబెట్టుకుని కాపాడుకుంటున్నాడు.. ఇలా అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటి పాలు కావడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి రైతులకు నెలకొంది. ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి భరోసా కల్పించడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏడాది నష్టపోతున్న నిలువ చేసుకోవడానికి గోదాముల ఏర్పాటు ఎందుకు చేయడం లేదని, కనీసం పంటలను వర్షం నుండి కాపాడుకొనుటకు కవర్లు,టార్పాలిన్లు, బరకాలు ఎందుకు ఇవ్వడం లేదని... వ్యవసాయ అధికారులు ఉన్నారా లేదా అన్నట్లుగా ఉందని రైతులు అంటున్నారు. ప్రతి ఏడాది ఏదో రకంగా రైతు నష్ట పోయినప్పటికీని ప్రభుత్వం నుంచి చిన్ని గవ్వ కూడా రాకపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి నిల్వ గోదాములు మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



Next Story

Most Viewed