చినుకుల కోసం ఎదురుచూపులు..

by Disha Web Desk 20 |
చినుకుల కోసం ఎదురుచూపులు..
X

దిశ, ఊట్కూర్ : ఎండలు మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా మండలంలో ఎటువంటి వర్షపాతం నమోదు కాకపోవటంతో రైతులు వాపోతున్నారు. జూన్ మొదటి వారంలో రెండు మూడు సార్లు మంచి వర్షాలు కురిశాయి. దీంతో రైతుల అందరిలో కొండంత ఆశ నెలకొంది. వర్షానికి అనుకూలంగా కొన్ని ప్రాంతాల రైతులు సాగుకు వీలుగా ఉన్న వ్యవసాయ భూములలో దున్నకాలు చేపట్టగా మరికొన్ని గ్రామాలలో రైతులు పత్తి విత్తనాలు పెట్టారు. వారం రోజులుగా ఒక్క వర్షపు చుక్క జడ లేకపోవడంతో పాటు విత్తనాలు వేసిన భూములలో పైర్లు వాడుముఖం పడుతున్నాయి. రోహిణి కార్తెలో పత్తి పంట పెడితే దసరా పండగ వరకు మంచి ధరతో పత్తిపంటను అమ్ముకోవచ్చని రైతులు భావించారు. కానీ ప్రస్తుతం రైతన్నలు వర్షపు చినుకుల కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉందని లేదంటే మరో వారంలోపు వేడి వాతావరణానికి విత్తనాలు పాడయ్యే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.

నాణ్యత కూడిన విత్తనాలు ఏవో తెలియక..

కొత్త కొత్త విత్తనాలు మార్కెట్ లోకి వస్తుండటంతో నాణ్యతతో కూడిన విత్తనాలు ఏవో తెలియక రైతులు తలలు పట్టుకున్నారు. రైతులు పత్తి విత్తనాలను 860 నుండి 1000 రూపాయల వరకు వేచించి ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేశారు. ప్రభుత్వం వివిధ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు పత్తివిత్తనాలను సబ్సిడీ పై సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరోసారి దంచి కొడుతున్న ఎండలు..

మండలంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. మృగశిర కార్తెలో సాధారణగా వాతావరణం చల్లబడుతుంది. కాని దానికి వ్యతిరేకంగా భానుడు తీవ్రప్రతాపం చూపుతోనే ఉన్నాడు. గడిచిన వారం రోజులుగా 39.0, 38.7 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పత్తివిత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed