మండుటెండలో ఉపాధి పనులు…కనీస అవసరాలు కరువు

by Disha Web Desk 11 |
మండుటెండలో ఉపాధి పనులు…కనీస అవసరాలు కరువు
X

దిశ, బిజినపల్లి : గ్రామాలలో వలసలు తగ్గించి స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో గతంలో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఉపాధి హామీ పనులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్న అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది 45 నుంచి 48 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం గ్రామాలకు దూరంగా ఉన్న చెరువుల్లో గుంతల్లో పూడిక తీసే పనులు కొనసాగుతున్నాయి. ఎర్రటి ఎండలో కష్టపడి చెమటోడ్చి పనిచేసిన వారికి కాసేపు సేద తీరడానికి కనీసం అందుబాటులో నీడలేని దుస్థితి నెలకొంది. వేసవి కాలం కావడంతో ఎండలు దంచి కొట్టడంతో ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశంలో మౌలిక వసతులు కరువయ్యాయి.

భానుడు భగభగ మండుతుండడంతో కూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేయాల్సి వస్తుంది. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో గతంలో ఉపాధి కూలీలకు వడదెబ్బ కొట్టి మృత్యువాత పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉపాధి చట్టం ప్రకారం పని ప్రదేశంలో నీడ ,మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఏవి కానరావడం లేదు. జీవనోపాధి కోసం మండుటెండల్లో ఉపాధి హామీ కూలీలకు వెళ్తున్నామని కూలీలు వాపోతున్నారు. ఇంత ఎండల్లో కూడా ఉపాధి పనులు చేస్తున్న రెండు మూడు నెలల నుంచి డబ్బులు రావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పని ప్రదేశాలలో సకల వసతులు కల్పించి డబ్బులు ప్రతి వారం పడేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ఉపాధి కూలీలు కోరుతున్నారు.



Next Story

Most Viewed