పాలమూరు పై బీఆర్ఎస్ ఫోకస్.. మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్

by Disha Web Desk 12 |
పాలమూరు పై బీఆర్ఎస్ ఫోకస్.. మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా పై గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కోసమైనా తెలంగాణ రావాలి.. మీరు ఎంపీగా గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగాను అంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాను ఉద్దేశించి పదేపదే అనేవారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి వనరులు మెరుగుపడ్డాయి. పంటలు బాగా పండుతున్నాయి.. ఒకరకంగా ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడిందని చెబుతూ వస్తున్నారు. పచ్చ బడ్డది కేవలం గతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్లే. నీటి వనరులు అందుబాటులోకి వచ్చి పంటలు పండుతున్నాయనే అంశం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేస్తాము అని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు.

కానీ పలు కారణాల వల్ల సాధ్యం కాలేదు. తన దృష్టి అంతా కాళేశ్వరం పై సాధించడం వల్ల ఇక్కడి ప్రాజెక్టు పూర్తి కాలేదు అని విమర్శలు రావడం, ఈ జిల్లాకు చెందిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ అధికార పార్టీ అధిపత్యాన్ని తగ్గించేలా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇదే జరిగితే మునుముందు ఇబ్బందులు తప్పవు అన్న ఆలోచనలతో సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై తమ పార్టీకి ఉన్న పట్టు తప్పకుండా వ్యూహరచనలు చేస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆయా జిల్లాలు, నియోజకవర్గాలలో పర్యటించి కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఆ ప్రభావం ప్రజలపై ఉండకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నెల రోజుల క్రితం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించి ఐటీ కారిడార్ ప్రారంభోత్సవం, అమర రాజా బ్యాటరీ కంపెనీ శంకుస్థాపనతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రతి పక్షాల నేతల పర్యటనల ప్రభావం లేకుండా తన వంతు ప్రయత్నం చేశారు.

8న మంత్రి కేటీఆర్

ఈనెల 8వ తేదీన మంత్రి కేటీఆర్ మరోసారి జిల్లాకు వస్తున్నారు. జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాలలో జరిగే కార్యక్రమాలు.. బహిరంగ సభలో మంత్రి ప్రసంగించనున్నారు. మరోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు సైతం వారం రోజులలో రెండు సార్లు ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చారు. ముందుగా జడ్చర్లలో నిర్వహించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈనెల 30వ తేదీన అచ్చంపేట పర్యటనకు వెళ్లి అక్కడ కూడా వంద పడకల ఆస్పత్రి, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. వారి ప్రభావం లేకుండా చేస్తున్నారు. త్వరలోనే కోస్గి పట్టణంలో నిర్మించిన ఆసుపత్రి భవన ప్రారంభోత్సవం కార్యక్రమంలోనూ మంత్రి హరీశ్ రావు పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ సైతం చాలా రోజుల తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాకు వస్తున్నారు. ఈనెల 6వ తేదీన నాగర్‌కర్నూల్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌లో లక్ష మందికి పైగా జనంతో భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ సభలలో సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి వనరులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి గురించి స్పష్టమైన హామీలు ఇవ్వనున్నారు. ప్రత్యక్షాలను ఇరుకున పెట్టేలా ప్రసంగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈనెల 12వ తేదీన సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు రానున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అక్కడ కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకుంటూ ప్రసంగాలు చేయడంతో పాటు సాగునీటి వనరుల సమస్యల పరిష్కారం పై హామీలు ఇవ్వనున్నారు. మొత్తంపై ఉమ్మడి పాలమూరు జిల్లా పై సీఎం కేసీఆర్ తో పాటు.. రాష్ట్ర మంత్రులు హరీశఖ రావు, కేటీఆర్ ప్రత్యేక దృష్టి ఎన్నికల్లో పట్టు సడలకుండా ముందుకు సాగుతున్నారు.

Read More... BRS నాలెడ్జి సెంటర్‌కు లైన్ క్లియర్.. రెండు రోజుల్లో శంఖుస్థాపన చేయనున్న కేసీఆర్!



Next Story

Most Viewed