87 కుటుంబాలు.. 281 మంది బలగం.. ఒకే వేదికపై ఐదు తరాల వారి ఆత్మీయ సమ్మేళనం..

by Disha Web Desk 11 |
87 కుటుంబాలు.. 281 మంది బలగం..  ఒకే వేదికపై ఐదు తరాల వారి ఆత్మీయ సమ్మేళనం..
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్ / బిజినపల్లి: తర తరాల నుంచి తమ వంశ ఆచారాలను కాపాడుకుంటూనే భావితరానికి స్ఫూర్తిగా ఉండాలనే సంకల్పంతో ఒకే వేదికపై ఐదు తరాలకు చెందిన వంశం.. కుటుంబ బలగం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమం బిజినపల్లి మండలం పాలెం కళ్యాణ మండపం వేదికైంది. ఐదు తరాల కుటుంబ బలగం తలోదారిలో ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఓ పెళ్లి కార్డు వీరందరినీ కలిసేలా చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన సిద్దాపురం వంశస్థుడు శివ శంకర్ ఇంటికి అదే వంశస్తులు పెళ్లి కార్డు ఇస్తూ ఇంటికి ఆహ్వానించాడు.

కాగా మన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పడమే తడవుగా ఒకరి నుంచి మరొకరికి వివరాలు సేకరించి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇలా మూడు నెలల సమయం అనంతరం అందరూ ఒకే వేదికపై కలుసుకున్నారు. మూల పురుషుడు కొండయ్య, గంగమ్మలకు ఇద్దరు కుమారులు బచ్చయ్య, బాల్ నాగయ్యలు జన్మించారు. వీరి ఇద్దరికీ చెరో నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఇలా ఏడు తరాల పాటు అందరి వివరాలను సేకరించి ఐదు తరాల వారి కుటుంబాల వారు కలుసుకొని సుఖ దుఃఖాలను పంచుకున్నారు. శాలువాలతో సత్కరించుకున్నారు. శివశంకర్, చిన్నాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 281 మంది హాజరయ్యారు.


Next Story

Most Viewed