లిక్కర్ స్కామ్‌: కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ప్రశ్నించనున్న ఈడీ

by Disha Web Desk 4 |
లిక్కర్ స్కామ్‌: కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ప్రశ్నించనున్న ఈడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి బుచ్చిబాబును ఈనెల 7వ తేదీన సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణకు సహకరించకపోవడంతో అతడిని కోర్టులో హాజరుపరుచగా మూడు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఈ క్రమంలో సౌత్ గ్రూప్‌నకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టేందుకు బుచ్చిబాబును ప్రశ్నించాలని ఈడీ కోర్టును కోరింది. ముఖ్యంగా మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ మరో రెండు రోజుల పాటు ప్రశ్నించనుంది. ప్రస్తుతం తిహార్ జైలులో బుచ్చిబాబు ఉండగా అక్కడే ప్రత్యేకంగా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తుండగా ఆమెకు గతంలో ఆడిటర్‌గా పని చేసిన బుచ్చిబాబును ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది చర్చనీయాంశం అవుతోంది.



Next Story

Most Viewed