రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భూమి.. ప్రభుత్వానిదా?.. ప్రైవేటుదా?

by Disha Web Desk 2 |
రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భూమి.. ప్రభుత్వానిదా?.. ప్రైవేటుదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భూములు ఎక్కడ అంటే.. కోకాపేట, ఖాజాగూడ ప్రాంతాలే. ఐతే అక్కడ మిగిలిన కొద్దిపాటి సర్కారు భూములను స్వాహా చేసేందుకు కొన్ని బడా కంపెనీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. దశాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా కొనసాగిన ల్యాండ్ పార్శిళ్లను మాయం చేస్తున్నారు. మోకాలికి, బోడిగుండుకు లింక్ పెడుతూ.. అవి పొరంబోకు భూములు కాదని, పట్టా భూములంటూ ఎన్వోసీలు జారీ చేశారు. పట్టా భూములైతే 70 ఏండ్ల నుంచి ఖాళీగా ఎందుకు ఉన్నది? ఇన్నేండ్లుగా లావాదేవీలు ఎందుకు చోటు చేసుకోలేదు? సిటీ మధ్యలో నిర్మాణాలకు ఎందుకు నోచుకోలేదు? రెవెన్యూ రికార్డుల్లో క్లాసిఫికేషన్ ఎందుకు మార్చలేకపోయారు? ఇవేం పట్టించుకోకుండా పెద్ద నాయకులకు అత్యంత సన్నిహితులుగా పేరున్న వారి కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలే రూ.2 వేల కోట్లకు పైగా విలువజేసే రూ.27 ఎకరాలకు ఎన్వోసీ జారీ చేశారన్న ప్రచారం జరుగుతున్నది.

అయితే, ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖలో ముక్కున వేలేసుకున్నారు. గతంలో పని చేసే ఏ కలెక్టర్ ప్రైవేటు పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదు. కానీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అమోయ్ కుమార్ మాత్రం కింది స్థాయి అధికారులు నెగిటివ్ రిపోర్ట్ పంపినా .. అది పట్టా భూమిగా తేల్చేస్తూ ప్రొహిబెటెడ్ జాబితా నుంచి తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు. ప్రైమ్ లొకేషన్.. పైగా వేలం వేస్తే ఎకరం రూ.100 కోట్లు పలికేంత విలువ కలిగిన భూమిని ప్రైవేటుపరం చేయడం వెనుక రహస్యమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆదేశాలతోనే ఎన్వోసీ జారీ చేశారా? కలెక్టర్ స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? అంటూ రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేసును సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సుమోటోగా స్వీకరించారు. ప్రభుత్వ భూమిని పట్టాగా మారుస్తూ జారీ చేసిన సర్క్యులర్ పై స్టే విధించారు. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఆ స్థలంలో ఎలాంటి క్రయ విక్రయాలు చేపట్టొద్దన్నారు. అలాగే నిర్మాణాలకు కూడా అనుమతులు జారీ చేయొద్దని స్పష్టం చేశారు.

అది సర్కారుదే: సీసీఎల్ఏ ఆర్డర్

రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డీవో, శేరిలింగంపల్లి తహశీల్దార్లకు, సలాబత్ ఖాన్, ఎం/ఎస్ బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, సయ్యద్ గౌస్ మీర్ ఖాసీం అలీ, అబ్దుల్ ఖాదర్, సిద్ధిఖ సుల్తానా, కుమ్మరి రావులకోలు శ్రీనివాస్ ల మధ్య నడిచిన కేసులో ఆగస్టు ఐదో తేదీన ఎలాంటి పనులు చేయరాదంటూ సీసీఎల్ఏ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నం.27 ని డీ నోటిఫై చేస్తూ జారీ చేసిన ఫైల్ నం.ఇ1/2970/2022, తేదీ.23.01.2023 పై సుమోటోగా కేసు నమోదు చేసింది. నిషేదిత జాబితా నుంచి తొలగింపు చెల్లదని పేర్కొన్నది. ఎలాంటి కమర్షియల్, రెసిడెన్షియల్ వంటి నిర్మాణాలేవీ చేపట్టరాదని స్పష్టం చేసింది. ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయంటూ కరపత్రాలు, తదితర మాధ్యమాల ద్వారా మార్కెటింగ్ చేయరాదని ఆదేశించింది. అనేక రకాల వివాదాలు ఉన్నాయని గుర్తించింది. అలాగే ఈ విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీని ఆదేశించింది.

దాంతో పాటు క్రయ విక్రయాలు చేపట్టరాదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కూడా అప్రమత్తం చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఈ కేసులో ప్రొసిడింగ్స్ నం.ఎస్ఈటీటీ.2/211/2023, తేదీ.5.8.2023 జారీ చేశారు. సర్వే నం.27/2లోని 27.18 ఎకరాలపై ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని బట్టి సదరు ల్యాండ్ పొరంబోకుదేనని తేల్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అమోయ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. దశాబ్దాలుగా పట్టా భూమిగా మార్చాలన్న విజ్ఞప్తులకు ఏ ఐఏఎస్ అధికారి, ఏ ఆర్డీవో, ఏ తహశీల్దార్ నిర్ణయం తీసుకోలేదు. కానీ అమోయ్ కుమార్ ఎవరి ఒత్తిడి మేరకు రూ.2 వేల కోట్ల విలువైన భూమిని పట్టాగా మార్చారన్న దానిపై పెద్ద చర్చ నడిచింది. తాజాగా నిర్మాణాలు చేపడుతుండడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల బిజీలో నిర్మాణాలు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నం.27లోని ప్రభుత్వ భూమిపై పెద్దోళ్ల దృష్టి పడింది. సందేట్లో సడేమియాలాగా అధికారులంతా ఎన్నికల బిజీగా ఉన్నప్పుడే హస్తగతం చేసుకునే వ్యూహరచన చేస్తున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మించి తమ స్వాధీనంలో ఉందని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటు ల్యాండ్ గా ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ జారీ చేసిన సర్క్యులర్ పై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సుమోటోగా కేసు స్వీకరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సర్క్యులర్ చెల్లదన్నారు. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలకు తెర తీస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెవెన్యూ రికార్డుల ప్రకారం

– 1960–61 పహానీ ప్రకారం ఖాజాగూడ సర్వే నం.28(ఓల్డ్ 117/3/1) లోని 64.26 ఎకరాలు, సర్వే నం.28(ఓల్డ్ 117/3‌‌4) లోని 31.39 ఎకరాలు పూర్తిగా పొరంబోకు, ప్రభుత్వానిది. 2013‌‌–14 పహానీల ప్రకారం కూడా 27/1 లోని 30.08 ఎకరాలు పొరంబోకు సర్కారీగా రికార్డు అయ్యింది. అలాగే 27/2లోని 27.18 ఎకరాలు, 27/2/ఎ లోని 2 ఎకరాలు, 27/3లోని ఐదెకరాలు మాత్రం పట్టాగా రికార్డు చేశారు.

– చాంద్ సుల్తానా తరపున వాళ్లు మాత్రం సర్వే నం.27, 28 లోని భూమి జాగీర్దార్ పట్టా అంటూ వాదిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయలేదంటున్నారు. ఐతే 1954 లో జారీ చేసిన పట్టాలపై అనుమానాలు ఉన్నాయి. పాత సర్వే నం.55లో 2.39 ఎకరాలు, 58 లో 13.20 ఎకరాలుగా ఉందంటున్నారు.

– ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1954–55, 1959–60 పహానీల ప్రకారం అదంతా పొరంబోకు భూమిగా ఉంది. ఐతే సర్వే నం.27 కి పాత సర్వే నం.117/3/1గా ఉన్నది. ఐతే సర్వే నం.55, 58, 119, 120 లను క్లెయిమ్ చేస్తున్నట్లు అధికారులు వాదిస్తున్నారు. ఈ సర్వే నంబర్లకు కొత్త సర్వే నం.27కి ఎలాంటి సంబంధం లేదని అధికారులు తేల్చారు.

– సర్వే నం.27/2 (ఓల్డ్ 119, 122) లోని విస్తీర్ణం 9.06 ఎకరాలను రెక్టిఫికేషన్ చేయాలంటూ సయ్యద్ గౌస్ మీర్ ఖాసీం అలీ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పెండింగులోనే ఉన్నది.

– ప్రస్తుతం సర్వే నం.27లోని మొత్తం 24 ఎకరాలు ఖాళీగా ఉన్నదని, గుట్టలు, పిచ్చిమొక్కలతో నిండింది. ఈ ల్యాండ్‌పై క్రయ విక్రయాలు చోటు చేసుకోకుండా నిషేదిత జాబితాలో 22ఎ కింద నమోదు చేశారు.

Next Story