సర్కారు సమన్వయ లోపం.. నిరుద్యోగుల్లో టెన్షన్

by Disha Web Desk 4 |
సర్కారు సమన్వయ లోపం.. నిరుద్యోగుల్లో టెన్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల సమన్వయం లోపం నిరుద్యోగులకు శాపంగా మారింది. ఒకేరోజు నాలుగు పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), జేఎల్ఎం పరీక్షలను ఈ నెల 30న నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు ఒకేరోజు నిర్వహించి తమకు అన్యాయం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో అటు బోర్డు, ఇటు తెలంగాణ సర్కార్ చిక్కుల్లో పడ్డాయి. కాగా, నాలుగు పరీక్షలను ఒకేరోజు నిర్వహించడంలోనూ అదే నిర్లక్ష్యం వహించడంపై నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పరీక్షను నిర్వహిస్తున్నది. ఇక అసిస్టెంట్ ఇంజినీరింగ్(ఏఈ), జూనియర్ లైన్ మెన్(జేఎల్ఎం) పరీక్షలు సంబంధిత సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జాబ్ క్యాలెండర్ వంటివి ఏర్పాటు చేసుకోకపోవడం, అధికారుల మధ్య సమన్వయం లోపం తలెత్తడం వంటివే ఇలాంటి తప్పిదాలకు కారణమని నిరుద్యోగులు వాపోతున్నారు. చాలామంది నిరుద్యోగులు ఇతర పరీక్షలకు సైతం దరఖాస్తు చేసుకున్నారు.

ఒకేరోజు నాలుగు పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఒక పరీక్ష రాస్తే మరో ఎగ్జామ్ రాసే అవకాశం కోల్పోయినట్లవుతుంది. అందుకే ఈ పరీక్షలను ఇతర తేదీల్లో నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఒకేరోజు నాలుగు పరీక్షలను అధికారులు నిర్వహిస్తామని తొలుత చెప్పారు. చివరకు మార్చడంతో నిరుద్యోగులు గండం నుంచి గట్టెక్కారు. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులే మళ్లీ తలెత్తడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా ఈ సమస్య పరిష్కారానికై పలువురు నిరుద్యోగులు ప్రతిపక్ష పార్టీల నేతలను సైతం కలిసి వినతులు అందించారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తామని, స్పందించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హామీ ఇచ్చారు.

నిరుద్యోగుల భవిష్యత్ ఆగం చేయొద్దు

రాష్ట్రంలో ఈనెల 30న ఒకే రోజు నాలుగు పరీక్షలను వివిధ బోర్డులు నిర్వహిస్తున్నాయి. అర్హులైన వారు ఒకే రోజు అన్ని ఎగ్జామ్స్ ఎలా రాస్తారు. అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నారు. కొందరు రూ.5 భోజనం తింటూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహించాలి. లేదంటో నిరుద్యోగుల భవిష్యత్ ఆగమవుతుంది.

- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి

మే 17న పాలిసెట్

- టెక్నికల్ బోర్డు సెక్రటరీ శ్రీనాథ్ వెల్లడి

టీ పాలిసెట్ ప్రవేశపరీక్షను మే 17న నిర్వహిస్తున్నట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ బోర్డు సెక్రటరీ శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రూ.200 ఆలస్య రుసుంతో అదే నెల 14న వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన సూచించారు. పరీక్ష అనంతరం 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.



Next Story

Most Viewed