పట్నం బ్రదర్స్‌కు సవాల్‌గా కొడంగల్.. హాట్ టాపిక్‌గా రేవంత్ సెగ్మెంట్!

by Disha Web Desk 4 |
పట్నం బ్రదర్స్‌కు సవాల్‌గా కొడంగల్.. హాట్ టాపిక్‌గా రేవంత్ సెగ్మెంట్!
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కొడంగల్ నియోజకవర్గం ఒకటి. ముఖ్యమంత్రి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్య జరిగే కొడంగల్ దంగల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారు.. అనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. ఓ వైపు రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తోడు కాగా, పట్నం నరేందర్ రెడ్డికి ఆయన సోదరుడు రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తోడు కావడంతో పోటీ రసవత్తరంగా సాగడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా రోజురోజుకూ కాంగ్రెస్ చాప కింద నీరులా బలం పెంచుకుంటున్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : కొడంగల్ అసెంబ్లీ ఎన్నిక పట్నం బ్రదర్స్‌కు సవాలుగా మారుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే పనిలో బీఆర్ఎస్ శ్రేణులు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరుల నియోజకవర్గంలో పట్టు సాధిస్తుంది. 2018 ఎన్నికలలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఓటమిపాలు అయిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇలా విస్తృత పర్యటనలు, సీఎం కేసీఆర్ వ్యూహాలు తదితర కారణంగా పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.

నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి మరోసారి తలపడేందుకు ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధం అయ్యారు. పోటీలో ఇతర పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికి ప్రధాన పోటీ మాత్రం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య ఉండడం ఆసక్తి రేపుతోంది. ఏ నోట విన్న కొడంగల్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు..!? అంటూ చర్చలు సాగుతున్నాయి. పని ఒత్తిడి కారణంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పర్యటించకపోతున్నప్పటికిని పార్టీ శ్రేణులు బాధ్యతలను తమ భుజస్కందాలపై వేసుకొని ముందుకు సాగుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.

అప్పుడప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఈ నియోజకవర్గము నుండి గెలిచి తీరాలన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎక్కడ ఓడానో అక్కడే గెలిచి తీరాలి అన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడి ఉండడం, గత ఎన్నికలలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశంగా ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా ఎలాగైనా ఎన్నికలలో గెలిచి తీరాలి అన్న లక్ష్యంతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.

ఈ ఐదేళ్ల కాలంలో నరేందర్ రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు నేరుగా ప్రజలలో కలిసిపోయారు. మరో వైపు నరేందర్ రెడ్డి సోదరుడు అయిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి రంగంలోకి దిగడంతో కొడంగల్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అక్కడక్కడ నాయకులకు ఉన్న అసంతృప్తి, పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి దూరం కావడం, తదితర సమస్యలను అధిగమించి నరేందర్ రెడ్డి విజయం సాధిస్తారా.. లేక ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగనున్న రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారా అన్న అంశం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేపుతోంది. ఇక, కొడంగల్ గడ్డ మీద జరిగే దంగల్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో తేలాలంటే డిసెంబర్ 3దాకా వేచి ఉండాల్సిందే..!


Next Story