దుమ్ముగూడెంలో అరెస్ట్ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలి

by Disha Web Desk 15 |
దుమ్ముగూడెంలో అరెస్ట్ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలి
X

దిశ, భద్రాచలం : గడ్చిరోలిలో జరిగిన పోలీసుల హత్యలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులే బాధ్యత వహించాలని, దుమ్ముగూడెంలో అరెస్టు చేసి మాయం చేసిన చత్తీస్​గడ్ ఆదివాసీ యువకులను ఏం చేశారో ప్రభుత్వం జవాబు చెప్పాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ శుక్రవారం విడుదల చేసిన లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో చేతులు కలిపి విప్లవ ప్రతిఘాతుక కగార్(అంతిమ దశ) ఆపరేషన్స్ కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజలపై, ప్రజాస్వామిక వాదులపై దాడులు చేయడానికి పూనుకుందన్నారు. మావోయిస్టు పార్టీ నిర్మూలనకు నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రకటించాయన్నారు. అందులో భాగంగానే మార్చి 19 తేదీన మహారాష్ట్ర, గడిచిరోలి జిల్లా, అహిరి తాలూకాలో కొల్లమర్క అడవీ ప్రాంతంలో రేపన్ పల్లి గ్రామం వద్ద ఎన్​కౌంటర్ పేరుతో మావోలు మంగు , రాజు, బుద్రాం లను హత్య చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని

అమలు చేస్తామన్న కాంగేస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన అనంతరం ఇప్పుడు విప్లవకారులను హత్యలు చేస్తుందని, వాస్తవానికి గడ్చిరోలిలో జరిగిన ఆ బూటకపు ఎన్ కౌంటర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పోలీసు ద్వారా జరిపించిందని అన్నారు. తిండి పదార్థాల్లో విషం ఇచ్చి వాళ్లను స్పృహ కోల్పోయాలా చేసి పట్టుకుని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని పేర్కొన్నారు. ఈ పథకం మంచిర్యాల జిల్లా ఎస్పీ ద్వారా అమలు చేశారని, ఈ ఎన్ కౌంటర్ నెత్తుటి మరకలు తెలంగాణ ప్రభుత్వం చేతులకు అంటకుండా మహారాష్ట్ర పోలీసుల ఎన్ కౌంటర్లో మరణించినట్లుగా నాటకీయంగా చిత్రీకరించారని ఆరోపించారు. సీ-60 పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఈ ఘటన అనంతరం మావోయిస్టు నిర్మూలన కోసం నిర్ణయాత్మక యుద్ధాన్ని మరింత పకడ్భందీగా కొనసాగించడానికి తెలంగాణ, మహారాష్ట్రాల మంచిర్యాల, భూపాలపల్లి. గడిచిరోలి జిల్లాల పోలీసు

ఎస్పీలతో సంయుక్త సమావేశం జరిపారని అన్నారు. దీనితో ప్రజాస్వామ్యం అనే ముసుగు తొడుక్కున్న కాంగ్రేస్ పార్టీ దమన నీతి ఏంటో అర్ధమవుతుందని పేర్కొన్నారు. మార్చి 8వ తేదీన చత్తీస్​గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్, తుమ్మిరెల్లి గ్రామానికి చెందిన మాదేవ్, మాడ్కాల్ అనే ఇద్దరు అమాయక ఆదివాసి యువకులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేసి మాయం చేశారని, 25 రోజులుగా వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్నా వారు ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ చెప్పకుండా మేము అరెస్టు చేయలేదని బుకాయిస్తున్నారని అన్నారు. చత్తీస్​గడ్ నుంచి మిర్చి కోతలకు వెళ్తున్న ఆదివాసీలను మావోయిస్టుల నేపంతో వేధిస్తున్నారని, వారి మకాంల వద్దకు వెళ్లి అరెస్టులు చేసి తీసుకెళ్లి తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు. బాధితుల ద్వారానే పోలీసులు ఎలాంటి చిత్రహింసలకు గురి చేయలేదనే పత్రాలు రాయించుకుని పంపిస్తున్నారని ఆరోపించారు. ఇటీవలే చర్ల పోలీసులు చత్తీస్​గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నేండ్ర గ్రామస్తులను ఐదుగురిని పట్టుకుని అందులో ముగ్గురి యువకులను చిత్రహింసలకు గురి చేసి పోలీసులు తమని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదనే పత్రాన్ని రాయించుకుని పంపారని ఆరోపించారు.


Next Story