తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ప్రకటనలకే పరిమితమా?

by Dishanational1 |
తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ప్రకటనలకే పరిమితమా?
X

దిశ, వైరా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గొప్పలు చెప్పుకుంటుంది. ప్రధానంగా రైతుల కోసం ఆ పథకం తెచ్చాం....ఈ పథకం తెచ్చామంటూ ప్రభుత్వ పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం... దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే సంకల్పంతోనే బీఆర్ఎస్ పార్టీని స్థాపించామంటూ ప్రకటించారు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో రైతుల పంటలకు సాగు నీరు సరఫరా చేసేందుకు ఇస్తున్న త్రీఫేస్ విద్యుత్తుకు పొంతన లేకుండా పోయింది. తాము రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా రోజుకు మూడు నుంచి ఐదు గంటలే త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అరకొరగా ఇచ్చే ఈ త్రీఫేస్ విద్యుత్తును కూడా రెండు పర్యాయాలు సరఫరా చేయటం విశేషం. గత వారం రోజులుగా త్రీఫేస్ విద్యుత్ కోసం రైతులు కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నారు. త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో రైతులకే కాదు... జిల్లా, మండల స్థాయి విద్యుత్ అధికారులు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఓవర్ లోడ్ పేరుతో ఇష్టారాజ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. రబీలో పంటలు సాగు చేస్తున్న రైతులు సాగునీటి కోసం త్రీఫేస్ విద్యుత్తు ఎప్పుడు వస్తుందో తెలియక పొలాల్లోని మోటార్ల కాడే పడి కాపులు కాస్తున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలైన ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలు దారితీస్తుంది.

అంతా స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచే మోనిటరింగ్

రాష్ట్ర వ్యాప్తంగా త్రీఫేస్ విద్యుత్ అప్రకటిత కోతలు మొత్తం హైదరాబాదులోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచే మోనిటరింగ్ జరుగుతుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. మిగిలిన ఉమ్మడి 5 జిల్లాలు ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నాయి. మొత్తం 10 జిల్లాలకు వారం రోజులుగా త్రీఫేస్ విద్యుత్ కటింగ్ చేస్తున్నారు. ఓవర్ లోడు పేరుతో, గ్రిడ్డు సమస్యతో అప్రకటిత విద్యుత్ కోతలు చేస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఏ సమయానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాలి.... ఏ సమయానికి సరఫరా నిలిపివేయాలి అనే విషయాన్ని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిర్ణయిస్తుంది. సబ్ స్టేషన్ పరిధిలోని ఏఈలకు, ఇతర అధికారులకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఆన్ చేయాల్సిన సమయాన్ని పావుగంట ముందు లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి మెసేజ్ వస్తుంది.

అదేవిధంగా త్రీఫేస్ విద్యుత్ నిలిపివేసే సమయాన్ని మెసేజ్ రూపంలో అధికారులకు లోడ్ డిస్పాచ్ సెంటర్ సిబ్బంది సమాచారం అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ అప్పట్లో కూడా కేవలం 12 గంటలు మాత్రమే త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేశారు. అప్పట్లో ఉదయం 6.15 నుంచి సాయంత్రం 6.15 వరకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేసేవారు. వారం రోజులుగా కేవలం 3 నుంచి 5 గంటల వరకే రెండు దఫాలుగా త్రీఫేస్ విద్యుత్ సరఫరా జరుగుతుంది. రైతులు త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందని సంబంధిత సబ్ స్టేషన్ లోని ఏఈలతోపాటు ఇతర అధికారులను అడిగినప్పటికీ ఆ అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం లేకుండా పోతుంది.

ప్రస్తుత రబీలో మోటార్ల కింద వరి, మొక్కజొన్న, చెరకుతోపాటు ఇతర పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత వారం రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో తన ఎకరం మొక్కజొన్న పొలమే నేటి వరకు పూర్తిస్థాయిలో తడవలేదని వైరాలో విద్యుత్ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారంటే త్రీఫేస్ విద్యుత్ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం లోడ్ తగ్గించేందుకు తగు చర్యలు తీసుకుని ప్రస్తుత రబీ సీజన్లో రైతుల పంటలకు సాగునీరు సరఫరా చేసేందుకు నిరంతరాయంగా త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.

వారం రోజులగా ఇబ్బందులకు గురవుతున్నాం: బండి గోపాలకృష్ణ, రైతు తాటిపూడి, వైరా మండలం

వారం రోజులుగా త్రీ ఫేస్ విద్యుత్తు సమస్యతో మొక్కజొన్న పంటకు సాగునీరు అందించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. త్రీఫేస్ విద్యుత్ ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. త్రీఫేస్ విద్యుత్ కోసం అధికారులను అడిగినా స్పష్టమైన సమాచారం ఇవ్వటం లేదు. ప్రస్తుతం మొక్కజొన్న పంట కంకి వేసే దశలో ఉంది. సరియైన సమయంలో సాగునీరు అందించకుంటే పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి: గ్రామీణ ప్రాంతాలకు ఐటీ విస్తరించాం : KTR



Next Story

Most Viewed