AP Election Polling:ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌

by Mamatha |
AP Election Polling:ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌
X

దిశ, ఏలూరు:జిల్లాలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని 1175 పోలింగ్‌ స్టేషన్లలో సోమవారం జరిగిన పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి మొత్తం జిల్లాలో 75 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రెండు గంటల్లో కేవలం 20 నుంచి 26 శాతం మాత్రమే ఓట్లు పోలింగ్ కాగా, ఆ తర్వాత 11గంటల నుంచి ఓటింగ్‌ వేగంగ పుంజుకుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో ఓటర్లు ఓటు వేయగలిగారు. జిల్లా కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ఏలూరులోని మత్య్స శాఖ కార్యాలయంలోని పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏలూరు టీడీపీ అభ్యర్ధి బడేటి చంటి పవర్‌పేటలోని అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ళ నాని తన ఓటును అశోక్‌నగర్‌లోని అశోకవర్ధిని పాఠశాలలో తమ ఓటును వినియోగించుకున్నారు. సీపీఐ అభ్యర్ధి బండి వెంకటేశ్వరరావు తన ఓటు హక్కును వెంకట్రావుపేట అప్పర్‌ ప్రైమరీ స్కూల్లో వినియోగించుకున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్ధి కారుమూరి సునీల్ కుమార్‌ తణుకులో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అభ్యర్ధి పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ వట్లూరు స్కూల్‌లో ఓటు వేశారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి కావూరి లావణ్య తన ఓటు హక్కును పెదపాడు మండలంలో వినియోగించుకున్నారు.

పోలింగ్ సందర్భంగా దెందులూరు నియోజవర్గంలోని దెందులూరు, కొప్పుల వారి గూడెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. దెందులూరు, ఏలూరు రూరల్‌ మండలాల్లో జరిగిన ఈ ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చేరిన బాధితులను దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని పప్రభాకర్‌ పరామర్శించారు. పోలింగ్‌ బూత్‌లపై దాడులు చేయడం అమానుషమని చింతమనేని ప్రభాకర్‌ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాలగూడెం, శ్రీపర్రు, దెందులూలరు మండలం సోమవరప్పాడు..కొవ్వలి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఒక పథకం ప్రకారం దాడులు జరిపి కత్తులతో గాయపరిచారని అన్నారు. దెందులూరులోని ఒక బూత్ వద్ద కార్యకర్తలు గుమిగూడడంతో పోలీసులు చెదరగొట్టారు. జిల్లాలో మిగిలిన చోట్ల ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది.

Read More..

పోటెత్తిన ఏపీ ఓటర్లు..ఆ జిల్లాలో భారీగా పోలింగ్ నమోదు

Next Story