ప్రభుత్వ భూమిపై పెద్దల కన్ను

by Disha Web Desk 12 |
ప్రభుత్వ భూమిపై పెద్దల కన్ను
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లి రెవెన్యూ పరిధిలోని సుమారు ఆరు ఎకరాల ఎన్ఎస్పీ భూమిపై గ్రానైట్ క్వారీ యజమాని కన్ను పడింది. గ్రానైట్ తవ్వకాల పేరిట హెక్టారు లోపు అనుమతులు తీసుకుని, విస్తీర్ణానికి మించి పనులు చేపడుతున్నారు. సుమారు ఏడాది కాలంగా ఈ తతంగం జరుగుతున్నది. గ్రానైట్ క్వారీ నుంచి వెలువడే మట్టిని, గ్రానైట్ వ్యర్థాన్ని అనుమతి పొందిన భూమిలోనే పోయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఎస్పీ భూమిలో పోస్తున్నారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువ పక్కనే ఉన్న పోలేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 149 లో సుమారు ఆరెకరాల భూమి ఉంది. క్వారీ యజమాని భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో గ్రానైట్ వ్యర్థాలు పోస్తున్నారు. రెవెన్యూ శాఖ నుంచి గాని, మైనింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే పొందినట్టు కలరింగ్ ఇస్తూ, తన పనులు చక్కబెట్టుకుంటున్నారు.

ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీ యజమాని నెమ్మదిగా ఎన్ఎస్పీ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శి సహకారంతోనే గ్రానైట్ క్వారీ యజమాని ప్రభుత్వ భూమిపై కన్నేసి నకిలీ పత్రాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటు రాజకీయ నాయకులకు, ఇటు ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో నగదు ముట్టినట్లు తెలుస్తున్నది. స్థాయిని బట్టి అధికారులు, రాజకీయ నాయకులకు రూ. రెండు లక్షల నుంచి రూ. మూడు లక్షల వరకు ముట్టజెప్పినట్టు క్వారీ యజమాని బహిరంగంగానే చెబుతున్నారు.

కబ్జాకు పూనుకున్న భూమి విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం పెద్ద మొత్తంలో ఉండవచ్చు అని తెలుస్తుంది. ప్రభుత్వ భూమిలో వ్యర్థాలు పోస్తున్న విషయాన్ని మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కబ్జాకు గురవుతున్న ఎన్ఎస్పీ భూమి విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దార్, గ్రానైట్ క్వారీ పనులను అడ్డుకోవాలని అధికారులకు సూచించారు. కబ్జాదారుల నుంచి ఎన్ఎస్పీ ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed