పథకాల అమలులో రాజీ లేదు : ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌

by Disha Web Desk 15 |
పథకాల అమలులో రాజీ లేదు :  ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌
X

దిశ, కారేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలులో రాజీలేదని ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ అన్నారు. కారేపల్లి మండల పరిషత్‌ సమావేశం మంగళవారం ఎంపీపీ మాలోత్‌ శకుంతల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు పలు శాఖల తీరును సమీక్షించారు. వ్యవసాయ శాఖ నివేధికను ఏవో ఉమామహేశ్వర్‌రెడ్డి సమర్పించారు. దీనిపై జోక్యం చేసుకున్న ఎమ్మెల్సీ గత 8 ఏండ్ల కాలంలో రైతులకు ప్రభుత్వం అందించిన సబ్సిడీలు, రైతుబంధు సౌకర్యాల వివరాలు పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులకు నివేదిక రూపంలో అందించాలని సూచించారు. విద్యాశాఖ నివేదికను ఎంఈవో జయరాజు ప్రవేశపెట్టగా దానిపై తొడితలగూడెం సర్పంచ్‌ బానోత్‌ కుమార్‌ మాట్లాడుతూ పంతుల్‌నాయక్‌తండాలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒకరిని డిప్యూటేషన్‌ వేశారని, దీంతో ఒకరితోనే పాఠశాల కొనసాగుతుందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకవచ్చారు. దానిపై స్పందించిన ఎమ్మెల్సీ ఆ సమస్యను పరిష్కరించాలని ఎంఈవోను ఆదేశించారు. గ్రామపంచాయతీల నెలవారి నిధులు సక్రమంగా రావటం లేదని ఉసిరికాయలపల్లి, మాధారం సర్పంచ్‌లు బానోత్​ బన్సీలాల్‌, అజ్మీర నరేష్‌లు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకరాగా ఎంపీడీఓ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కొద్ది రోజుల్లో నిధుల సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. సమీక్షా అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 233 పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలును రాజీ లేకుండా చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛాభారత్‌లో ప్రకటించిన అవార్డులలో 18 అందుకొని తెలంగాణ సత్తా చాటామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పని తీరు ప్రజాభిమానం చూరగొనేలా ఉండాలని ఆకాంక్షించారు. సింగరేణి మండలం ఏజెన్సీ మండలమని, దాని అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దారావత్‌ మంగీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed