ఖమ్మం మెడికల్ విద్యకు ఎన్ఎంసీ అనుమతి

by Disha Web Desk 12 |
ఖమ్మం మెడికల్ విద్యకు ఎన్ఎంసీ అనుమతి
X

దిశ, ఖమ్మం బ్యూరో: ఖమ్మంలో ఏర్పాటు కాబోతున్న మెడికల్ కాలేజీకి సంబంధించి మరో ముందడుగు పడింది. కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, వరంగల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2023-24 సంవత్సరానికి సంబంధించి వంద సీట్లకు ఆమోదించినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ తెలిపింది. మొదటి బ్యాచ్‌ను ఈ సంవత్సరం నుంచే ప్రారంభించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. నేషనల్ మెడికల్ కమిషన్ రెగ్యులేషన్‌లో నిర్దేశించినట్లుగా, విద్యా సంవత్సరం పొడవునా భౌతిక, మానవ వనరులు, బోధనా అధ్యాపకులు, క్లినికల్ మెటీరియల్‌లు మొదలైన వాటితో సహా నిబంధనలన్నీ కొత్త కాలేజీకి వర్తిస్తాయని పేర్కొంది.

నియమ నిబంధనలకు లోబడి లేకున్నా.. తప్పుడు సమాచారం అందించినా.. కాలేజీ అనుమతి రద్దు చేసే అనుమతి ఉంటుందని జాతీయ వైద్య కమిషన్ పేర్కొంది. అంతేకాదు.. చట్టం ప్రకారం చర్యలు తీసుకునే హక్కు కూడా ఉంటుందని తెలిపింది. వైద్య కళాశాలశాలలో బయోమెట్రిక్ హాజరు, వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడం తప్పనిసరని, కళాశాల అందించే కోర్సులు, అందుబాటులో ఉన్న అధ్యాపకులు, వారి అనుభవం వివరాలు.. చేరిన విద్యార్థులు, అనుబంధ విశ్వవిద్యాలయం లాంటి మొత్తం సమాచారాన్ని ప్రదర్శించాలని ఎన్ఎంసీ పేర్కొంది. ఇప్పటికే విద్యా హబ్ గా ఉన్న జిల్లా ఈ రెండింటి అనుసంధానంతో మరింతగా అభివృద్ధి బాట పట్టనుంది.

ఖమ్మంలో రకరకాల ఫెసిలిటీస్ తో వందలాది ప్రైవేట్ ఆస్పత్రులు ఉండగా, మమత మెడికల్ కాలేజీ కూడా నడుస్తున్నది. ఈ విద్యా సంవత్సరం 2023-24 నుంచే ప్రభుత్వ మెడికల్ కళాశాల తరగతులను నిర్వహించేందుకు 100 సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు కూడా ఇచ్చింది.. నగరంలో స్థాపించే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.166కోట్ల నిధులను ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కూడా అప్ గ్రేడ్ చేయనుంది. ఈ మేరకు నగరంలోని పాత కలెక్టరేట్ స్థలం, ఆర్ అండ్ బీ స్థలంతోపాటు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గల స్థలంతో కలిపి మొత్తం 30 ఎకరాల భూమిని మెడికల్ కాలేజీకి బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed