ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి.. పోలీసుల కంటే ముందు నేనే ఉంటా...

by Disha Web Desk 18 |
ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి.. పోలీసుల కంటే ముందు నేనే ఉంటా...
X

దిశ, నేలకొండపల్లి: మండల పరిధిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంతోపాటు శంకుస్థాపన చేశారు. కట్టు కాచారం గ్రామంలో రూ. 2 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముజ్జుగూడెంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను అలాగే నేలకొండపల్లి కట్టుకాచారం, పైనంపల్లి, రాజేశ్వరపురం, చెర్వుమాధారం, సుర్దేపల్లి, నాచేపల్లిలో రైతువేదిక భవనాలను మంత్రి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాకముందు 7 వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ ని తెలంగాణ వచ్చిన ఎనిమిది సంవత్సరాల్లో 17 వేల మెగావాట్లకు పెంచామని ఆయన అన్నారు. కేంద్రం విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నదని, అదే జరిగితే ఇరవై లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి రానుందన్నారు. విద్యుత్ ప్రయివేటు పరమైతే పేదలకు ఇచ్చే ఉచిత విద్యుత్ ను ఇవ్వలేమన్నారు. కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి తెలిపారు.

కొంతమంది చిల్లర రాజకీయాలు మానుకోవాలి: పాలేరు ఎమ్మెల్యే

మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ గ్రామంలో కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తున్నారని గ్రామంలో ఎవ్వరు రౌడీయిజం చేసినా సహించమన్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి పోలీసుల కంటే ముందు నేనే ఉంటా... అని అన్నారు. మీ గ్రామంలో అండర్ పాస్ నిర్మాణంలో ఎవరెవరు ఏదో మాట్లాడుతున్నారని అవన్నీ నమ్మకండి.. అండర్ పాస్ నిర్మించే బాధ్యత తనదేనన్నారు. చిల్లర రాజకీయాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే పెత్తనం చేయాలని ఆశించేవారి ఆటలు ఇక సాగవన్నారు. ఆసరా పింఛన్ లో రాజకీయాలు వద్దని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో రవాణాశాఖ, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, రైతుబంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, నేలకొండపల్లి ఏఎంసీ చైర్మన్ నంబూరి శాంత, రైతు సమన్వయ సమితి చైర్మన్ శాఖమూరి సతీష్ సీడీసీ చైర్మన్ లీలా ప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, నాగబండి శ్రీనివాసరావు, నేలకొండపల్లి, కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు బ్రహ్మయ్య, వేముల వీరయ్య, మండల సెక్రెటరీ వెన్నెబోయిన శ్రీను, మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు, కందాళ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Next Story