వైరా డివిజన్ విద్యుత్ శాఖలో అధికారుల ఇష్టారాజ్యం

by Disha Web Desk 12 |
వైరా డివిజన్ విద్యుత్ శాఖలో అధికారుల ఇష్టారాజ్యం
X

దిశ, వైరా: వైరా డివిజన్ విద్యుత్ శాఖలోని అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యం కొనసాగుతూనే ఉంది. వైరా డివిజన్ కార్యాలయంలో పనిచేసే డీఈ స్థాయి అధికారి నుంచి ఈఆర్ఓ కార్యాలయం, ఫీల్డ్ స్టాప్ అధికారులు, సిబ్బంది వరకు స్థానికంగా ఉండటం లేదు. చివరకు అటెండర్లు సైతం స్థానికంగా ఉండని పరిస్థితి నెలకొంది. యథా రాజా తథా ప్రజా అన్నట్లు డివిజన్ స్థాయి అధికారులను చూసి కింద స్థాయి సిబ్బంది వరకు వారు పని చేసే ప్రాంతమైన వైరాలో ఉండటం లేదు.

డీఈ, ఏడీ, ఏఈలే స్థానికంగా ఉండటం లేదు. వారికి నిబంధనలను వర్తించినప్పుడు మాకు నిబంధనలు ఎలా వర్తిస్తాయని కొంతమంది ఫీల్డ్ స్టాఫ్ బహిరంగంగా వ్యాఖ్యానించడం విశేషం. రాత్రి వేళల్లో విద్యుత్ సమస్య వస్తే వైరాలో పరిస్థితి అత్యంత అద్వానంగా మారుతున్నది. ఈ తతంగం అంతా ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా కనీసం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

ఖమ్మం నుంచే డైలీ సర్వీస్..

వైరా డీఈ నుంచి అటెండర్ వరకు ఖమ్మం నుంచి డైలీ సర్వీస్ చేస్తున్నారు. డీఈ వైరాలో కొద్ది రోజులు, ఖమ్మంలో మరికొన్ని రోజులు నివాసం ఉంటున్నారు. వైరా, ఖమ్మంలో వేరువేరుగా ఇండ్లను అద్దెకు తీసుకున్న ఆయన తనకు ఉద్యోగ పరంగా ఇబ్బందులు వస్తాయనే సమయాల్లో వైరాలో, లేకుంటే ఖమ్మంలో నివాసం ఉంటున్నారు.ఏడీ ఖమ్మంలో నివాసం ఉంటూ వైరాకు డైలీ సర్వీస్ చేస్తున్నారు. వైరాలోని ఒక హోటల్‌పై గదిని అద్దెకి తీసుకొని ఆగదిలో మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటున్నారు.

ఉన్నతాధికారులు అడిగితే తాను కుటుంబంతో ఆగదిలోనే ఉంటున్నట్లు ఆయన బిల్డప్ క్రియేట్ చేస్తున్నారు. వైరా టౌన్ ఏఈ, ఫోర్‌మెన్ సైతం ఖమ్మం నుంచి డైలీ సర్వీస్ చేస్తున్న విషయం స్థానికులకు తెలిసిందే. వీరు వైరాలో బ్యాచిలర్ రూమ్స్ తీసుకుని మధ్యాహ్నం సేద తీరుతున్నారు. టౌన్ లైన్ ఇన్‌స్పెక్టర్ కల్లూరు మండలం ముత్సారం నుంచి, అసిస్టెంట్ లైన్‌లైన్ ఖమ్మంలోని బల్లేపల్లి నుంచి వైరాకు డైలీ సర్వీస్ చేస్తున్నారు. టౌన్ కార్యాలయ సబ్‌ఇంజినీరు తల్లాడ నుంచి వస్తున్నారు. డీఈ కార్యాలయం, ఈఆర్ఓ కార్యాలయాల్లోని ఏఈలు జేఏవోలు యూడీసీలో ఎల్డీసీలు అటెండర్స్ ఖమ్మంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వైరాకు డైలీ సర్వే చేస్తున్నారు.

సబ్ స్టేషన్ ఆపరేటర్లు సైతం స్థానికంగా ఉండటం లేదు

టీఎస్ ఎన్పీడీసీఎల్ నుంచి నెలకు వేలాది రూపాయలు ఇంటి అద్దె రూపంలో తీసుకుంటున్న విద్యుత్ అధికారులు సిబ్బంది స్థానికంగా ఉండకపోయినప్పటికి పట్టించుకునే వారే కరువయ్యారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఎన్పీడీసీఎల్ సీఎండీ స్పందించి స్థానికంగా ఉండని అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.

అంతా స్థానికంగానే ఉంటున్నారు

వైరా డివిజన్ కార్యాలయం, ఈఆర్ఓ కార్యాలయం అధికారులు, సిబ్బందితో పాటు ఫీల్డ్ స్టాప్ అంతా స్థానికంగానే ఉంటున్నారని వైరా డీఈ కృష్ణ వివరణ ఇచ్చారు. అధికారులు, సిబ్బంది ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారని చెప్పారు. అధికారుల సిబ్బంది ఇక్కడ నివాసం ఉంటున్నట్లు ఇంటి నెంబర్లు కూడా ఇచ్చారని పేర్కొన్నారు.- వైరా డీఈ కృష్ణ



Next Story

Most Viewed