రాజకీయ అండతోనే అక్రమ వ్యాపారం.. రోడ్డున పడ్డ ప్లాట్ల కొనుగోలుదారులు

by Disha Web Desk 6 |
రాజకీయ అండతోనే అక్రమ వ్యాపారం.. రోడ్డున పడ్డ ప్లాట్ల కొనుగోలుదారులు
X

దిశ, వైరా: మున్సిపాలిటీలో డీటీసీపీ అనుమతి లేని ప్లాట్లను కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి కుటుంబాల వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధనార్జనే ధ్యేయంగా గతంలో వైరాలోని పలు ప్రాంతాల్లో డీటీసీపీ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ల వేశారు. ఈ వెంచర్ల లోని ప్లాట్లను పేద, మధ్యతరగతి కుటుంబాల వారు కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో రియల్ వ్యాపారులు సబ్ రిజిస్టార్లను మేనేజ్ చేసి కొనుగోలుదారుల పేర్లు పై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ప్రస్తుతం ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అడ్డ కత్తెరలో పోక చెక్కలా మారింది. డీటీసీపీ అనుమతి లేని ప్లాట్లపై దిశ దినపత్రికలో ఇటీవల అనేక వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు డిటిసిపి అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ లను నిలిపివేశారు. వైరా లో రాజకీయ అండతో ఈ వెంచర్లు వేసి విక్రయించారు. ప్రస్తుతం ఈ వెంచర్ల లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆ ప్లాట్లను రీసెల్ చేసేందుకు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంచర్లు వేసిన రియల్టర్లు మాత్రం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండన్నట్లు.. మేము ప్లాట్లు విక్రయించాం.. ఇప్పుడు మాకేం సంబంధం అంటూ కొనుగోలుదారులతో ఎదురు వాదనకు దిగటం విశేషం. దీంతో ప్లాట్లను విక్రయించిన వారు కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి ప్రజలను నిండా ముంచినట్లు అయిందనే విమర్శలు వినవిస్తున్నాయి.

డిటిసిపి అనుమతి లేని వెంచర్లు వివరాలు ఇవే..

వైరా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత డీటీసీపీ అనుమతి లేకుండా వైరాలో పుట్టగొడుగుల అనేక వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్లలోని ప్లాట్లను అత్యధిక భాగం ఇప్పటికే విక్రయించి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేశారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ లను అధికారులు నిలిపివేశారు. వైరా మండలంలోని సోమవారం గ్రామ సమీపంలో, గండగల పాడు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల సమీపంలో, బీసీ కాలనీలో, వైరా లోని బీసీ కాలనీలో, వైరాలో న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల సమీపంలో, కమ్మవారి కళ్యాణమండపం రోడ్ లో, దిద్దుపూడి రోడ్, తల్లాడ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్ల వేసిన ప్రతి ఒక్క రియల్టర్ కు ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండటం విశేషం. ఈ వెంచర్లో ప్లాట్లు కొని మరల రిజిస్ట్రేషన్ కాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులు సుమారు 150 మంది పైనే ఉన్నారు. ఇటీవల ఒక రియల్టర్ మేము ప్లాట్లు అమ్మేశాం.. కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ కూడా చేశాం.. మా పని అయిపోయింది. ఏదైనా తేడా వస్తే 2021 సంవత్సరం ప్రధమార్ధంలో తమ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన అధికారి లేచిపోతాడు. లేదంటే కొనుగోలు చేసిన వారు నష్టపోతారంటూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రియల్ వ్యాపారుల లాభాపేక్ష కోసం పేద మధ్య తరగతి ప్రజలను బలి చేసారానే విమర్శలు వస్తున్నాయి.

ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితల్లో చెయ్యం..

మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత డీటీసీపీ అనుమతి లేకుండా వేసిన వెంచర్ లోని ప్లాట్లకు ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చెయ్యం మోయిజ్ అలీ, వైరా సబ్ రిజిస్టార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలు మాకు స్పష్టంగా ఉన్నాయి. గతంలో ఇలాంటి ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసి ఉండి మరలా ఆ ఫ్లాట్లు విక్రయించిన రిజిస్ట్రేషన్ కాదు. అన్ని అనుమతులతో పాటు, ఇతర డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం.

Next Story

Most Viewed