కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే

by Disha Web Desk 15 |
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొత్తగూడెంలోని సూపర్ బజార్ సెంటర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు న్యాయం జరగాలని కొత్తగూడెం ను జిల్లా గా ఏర్పాటు చేసుకున్నామన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాను తీసేస్తా అంటున్నాడని, జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించుకొని తీరాలన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు వాగ్దానాలు చేసిందని, రైతు రుణమాఫీ లేదు, తులం బంగారం లేదు ప్రతి మహిళకు రెండు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేస్తామని వాగ్దానం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు.

కేసీఆర్ ఉన్నప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కరువైందని అన్నారు. మారు మూల ప్రాంత మైన పినపాకకు మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్లు అందించామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీరు ఎందుకు ఇవ్వలేకపోతుందని ప్రశ్నించారు. ఒక లక్ష పోడు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. బంజారాలకు బంజారా భవన్ ఏర్పాటు చేశామన్నారు. సింగరేణి కార్మికులకు అత్యధిక బోనస్ ఇచ్చిన ఘనత మాదేనని, సింగరేణి ని ముంచే పనిలో ఈ ముఖ్యమంత్రి చోటాబాయ్.. నరేంద్రమోడీ బడే భాయ్..ఉన్నారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ పేరుతో ఆటో డ్రైవర్ ల బతుకులు ఆగాం చేసి వారి

ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. నరేంద్రమోడీ పది సంవత్సరాల పరిపాలనలో ఒక్క మంచి పని ఎవ్వరికైనా చేశాడా అని ప్రజలను ప్రశ్నించారు. మళ్లీ మన గోదావరి నది నీళ్లు తమిళనాడు, కర్ణాటక తరలించుకు పోతా అంటున్నారని తెలిపారు. అయినా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. నరేంద్రమోడీ తెలంగాణ లో రైతులకు మోటార్ లకు మీటర్లు పెట్టాలని అంటే గొంతు తెగిపడినా తాను పెట్టను అన్నా.. అని, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే పనిలో ఉన్నారని అన్నారు. తెలంగాణ లో నీళ్లు, నిధులు కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి ప్రజలను కోరారు.

Next Story

Most Viewed