మునుగోడుపై కేసీఆర్ అసంతృప్తి.. మంత్రులు, ఎమ్మెల్యేలపై సీరియస్

by Disha Web Desk 2 |
మునుగోడుపై కేసీఆర్ అసంతృప్తి.. మంత్రులు, ఎమ్మెల్యేలపై సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు బై ఎలక్షన్‌లో సొంత పార్టీ నేతల తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్లానింగ్ ప్రకారం ప్రచారం జరగట్లేదని క్లాస్ పీకినట్టు సమాచారం. లోకల్, నాన్ లోకల్ లీడర్ల మధ్య ఎందుకు సమన్వయం లేదని, అన్ని వనరులు సమకూర్చినా ఎందుకు సీరియస్‌గా ప్రచారం చేయట్లేదని మండిపడినట్టు తెలిసింది. గురువారం ప్రగతిభవన్‌కు నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిని పిలిచి ఎన్నికల ప్రచార తీరుపై సమీక్ష జరిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఆరా తీశారు. పార్టీ, ప్రభుత్వం వేరువేరుగా చేయిస్తోన్న సర్వేల్లో బీజేపీ అభ్యర్థి బలం పుంజుకుంటున్నట్టు వస్తోన్న రిపోర్టులు చూసిన కేసీఆర్ అలర్ట్ అయినట్టు తెలిసింది. ఓటర్లకు మరింత దగ్గరయ్యే విధంగా ప్రచార తీరును మార్చాలని సూచించినట్టు సమాచారం.

మీ సొంత ఎన్నికైతే ఇలాగే చేస్తారా?

ప్రతి ఎంపీటీసీ యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యేకు ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించారు. ఆ యూనిట్‌లో రెండున్నర వేల నుంచి మూడు వేల వరకు ఓటర్లు ఉన్నారు. మెజార్టీ యూనిట్లలో లోకల్ లీడర్ల మధ్య సమన్వయం చేయట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం లోకల్ లీడర్లను బుజ్జగించండని, వారి సహకారం లేకపోతే సమస్యలు వస్తాయి. వారిని కలుపుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఎన్నికల ఇన్‌చార్జీగా బాధ్యతలు తీసుకున్న మేజార్టీ ఎమ్మెల్యేలు రోజువారి అవసరాల కోసం నిధులు కావాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని కూడా కేసీఆర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ''ఎవరికి ఏ లోటు రాకుండా పార్టీ వనరులను సమకూర్చింది. అవి వచ్చే వరకు మీ సొంతంగా నిధులు ఖర్చు చేయ్యలేరా? మీ ఎన్నికైతే ఇలాగే చేస్తారా? మీకు మొత్తం నియోజకవర్గం బాధ్యతలు ఇవ్వలేదు. కేవలం ఓ గ్రామం బాధ్యతలు ఇచ్చాం.. అది కూడా చెయ్యకపోతే ఎలా'' అని సీరియస్ అయినట్టు తెలిసింది.

వలస వెళ్లిన లీడర్లను వెనక్కి పిలవండి

సెగ్మంట్‌లో పార్టీల మధ్య లీడర్లు, కార్యకర్తల వలసలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన లీడర్లను వెనక్కి పిలవండని, అందుకు ఎంత ఖర్చైనా భరించండని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ''లీడర్ల వలసలను అరికట్టకపోతే పార్టీ ఓడిపోతుందని అనుమానం ప్రజల్లో వస్తుంది. అందుకే లీడర్లను వెనక్కి రప్పించండి'' అని సూచించినట్టు సమాచారం. సీఎం నుంచి ఆదేశాల రావడంతో గత వారం బీజేపీలోకి వెళ్లిన మర్రిగూడ, చండూరు మండలాలకు చెందని లోకల్ లీడర్లను తెలంగాణ భవన్‌కు పిలిచి మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేర్చుకున్నారు.

బహిరంగ సభ అదిరిపోవాలే

ఈ నెల 30న చండూరు మండలంలో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభతో సెగ్మెంట్‌లో పూర్తి అనుకూల పరిస్థితులు రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ జరగాలని, అందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు పొరుగనున్న రంగారెడ్డి జిల్లాల నుంచి జనసమీకరణ చేయాలని సూచించినట్టు తెలిసింది.


Next Story