బీసీలకు రూ.లక్ష స్కీమ్ వెనుక భారీ ప్లాన్.. దానికి భయపడే KCR హుటాహుటి ప్రకటన..?

by Disha Web Desk 19 |
బీసీలకు రూ.లక్ష స్కీమ్ వెనుక భారీ ప్లాన్.. దానికి భయపడే KCR హుటాహుటి ప్రకటన..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వంపై బీసీ వర్గాలు కోపంగా ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు కుల వృత్తులను కాపాడేందుకు చర్యలు తీసుకోలేదని భావిస్తున్నాయి.ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ముందు వారిని శాంతపరిచే ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. బీసీ కుల వృత్తులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసే కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌లో స్కీమ్ విధివిధానాల రూపకల్పనకు మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా ఎన్నికల ముందు కొనసాగే హడావుడి మాత్రమేనని విమర్శలు వస్తున్నాయి.

ఎన్నికల స్టంట్?

జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీ కులాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదని ఆ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయి. దళిత బంధు వచ్చాక ఈ ఆగ్రహం మరింత పెరిగిందని బీఆర్ఎస్ లీడర్లే అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. పద్మశాలీ, గౌడ కులస్తులకు పింఛన్, గొల్ల కుర్మలకు గొర్లు, బర్లు, ముదిరాజ్, గంగపుత్రులకు చేపలు పంపిణీ చేస్తుండగా, మిగతా బీసీ కులాలకు మాత్రం ఎలాంటి స్కీమ్స్ అమలు కావడం లేదు. వీరంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోననే భయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పట్టుకున్నది. ఈ విషయాన్నే గ్రహించిన సీఎం కేసీఆర్, ఎన్నికలకు ముందు బీసీ కుల వృత్తులను ఆదుకునేందుకు లక్ష ఆర్థిక సాయం చేస్తామని స్కీమ్‌కు రూపకల్పన చేశారని చర్చ జరుగుతున్నది.

రూ. 20 వేలు లబ్ధిదారుడే భరించాలి

బీసీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష లోన్ ఇవ్వనున్నారు. అయితే అందులో రూ. 20 వేలు లబ్ధిదారుడే విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ. 80 వేలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. మొదటి విడత రుణాలను రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది వేడుకల సందర్భంగా విడుదల చేస్తారు. అయితే లబ్దిదారుల ఎంపిక విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకేసారి మంగలి, చాకలి, వడ్రంగి, కుమ్మరి, కంసాలితోపాటు ఇతర బీసీ కుల వృత్తులందరికి లోన్లు ఇస్తారా? లేక విడుతల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పెండింగ్ లో 6.5 లక్షల దరఖాస్తులు

రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్ మూలకు పడింది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ కుల వృత్తులకు ఆ కార్పొరేషన్ కింద లోన్లు ఇచ్చేవారు. అయితే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించేవారు. కానీ వాటిని ఖర్చు చేయొద్దని మౌఖిక ఆదేశాలు ఉండడంతో అధికారులు ఎవరికీ లోన్లు ఇచ్చేవారు కాదనే విమర్శలున్నాయి. దీంతో 2018 నుంచి ఇప్పటివరకు సుమారు 6.5 లక్షల దరఖాస్తులు బీసీ కార్పొరేషన్ వద్ద పెండింగ్‌లో పడిపోయాయి.

మూలకు పడ్డ ఎంబీసీ కార్పొరేషన్

ఎంబీసీ కులాలను ఆదుకునేందుకు ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. దానికి బడ్జెట్‌లో రూ. వెయ్యికోట్లను కేటాయించారు. చైర్మన్‌గా తాడూరు శ్రీనివాస్‌ను నియమించారు. అతని పదవి కాలం ముగిసి నాలుగేండ్లవుతున్నది. ఇప్పుడు ఆ కార్పొరేషన్ ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అలాగే ప్రతి ఏటా ఆ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లను కేటాయిస్తున్నారే కానీ, వాటిని ఖర్చు చేయడం లేదు. ఇప్పుడు బీసీ కుల వృత్తులను ఆదుకునేందుకు ఎంబీసీ కార్పొరేషన్‌ను యాక్టివ్ చేస్తారా? లేక బీసీ కార్పొరేషన్ కిందే లోన్లు ఇస్తారా అనేదానిపై స్పష్టత లేదు.

Read more:

కేసీఆర్‌ను వాళ్లు నమ్మడం లేదా..? కొత్త చర్చకు తెరలేపిన కర్నాటక CM ప్రమాణాస్వీకారోత్సవ కార్యక్రమం

Next Story