కేసీఆర్ కార్మికులను పురుగుల్లా చూస్తున్నారు: షర్మిల

by Disha Web Desk 12 |
కేసీఆర్ కార్మికులను పురుగుల్లా చూస్తున్నారు: షర్మిల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను పురుగుల్లా చూస్తూ.. కార్మికులను కేసీఆర్ ఎడమ కాలు చెప్పు కింద తొక్కి పెట్టారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. సోమవారం మేడే సందర్భంగా పాలేరు పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులు లేకపోతే మెతుకు.. ఇంటికి వెలుగు లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేశారని, ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం పోరాటం చేస్తే కనీసం గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో కార్మికులు సమ్మె చేస్తే తొక్కి పెట్టారని, భయ బ్రాంతులకు గురి చేసి సమ్మెను విచ్ఛిన్నం చేశారన్నారు.

కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, కేసీఅర్‌కు బానిసలా బ్రతకాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కనీసం వేతనాలు కూడా తెలంగాణ లో అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో కోటి మంది కార్మికులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు లేవన్నారు. ఎనిమిది గంటల పని విధానం కూడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో లక్ష మంది కాంట్రాక్టు బేసిక్ మీద పని చేస్తున్నారని, ఇందులో ఐదు వేల మందిని రెగ్యులర్ చేస్తే ఎలా..? అని నిలదీశారు. ఇక కేంద్రం అమలు చేస్తున్న నిర్ణయాలు కూడా సరైనవి కావని, ఉపాధి హామీ పథకం కింద గొడ్డు చాకిరీ చేయించి 40 రూపాయలు ఇస్తారా..? అని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ బిడ్డ వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తుందని, ఎటువంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed