కేసీఆర్ రాజకీయాలకు మతాన్ని వాడుకోలేదు : హరీష్ రావు

by Disha Web Desk 4 |
కేసీఆర్ రాజకీయాలకు మతాన్ని వాడుకోలేదు : హరీష్ రావు
X

దిశ, మెదక్ ప్రతినిధి : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నా రాజకీయాలకు ఎన్నడు మతాలను వాడుకోలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఏడుపాయల‌లో ప్రారంభమైన మహా శివరాత్రి జాతర ఉత్సవాలకు ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు మంత్రి హరిశ్ రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మధన్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా‌తో కలిసి శనివారం సమర్పించారు.

వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణ కుంభంతో మంత్రి‌కి చైర్మన్ బాలాగౌడ్ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు అదర్శoగా నిలుస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా దేవాలయల అభివృద్దికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నామని వివరించారు.

ఈ సారి కూడా రూ. 2 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. భూ లోక వైకుంఠంగా యాదాద్రిని సీఎం కేసీఆర్ అభివృద్ది చేశారన్నారు. అలాగే ఇటీవల కొడగట్టు కోసం రూ.1000 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు. దేవాలయాల అభివృద్ది చేస్తున్నా ఎప్పుడు కూడా రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకొలేదన్నారు. ఎన్నిక అప్పుడే రాజకీయం చేయాలని సూచించారు.

రాజకీయంగా పేరు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కోరుకోలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఆలయాలు ఉండాలన్న మంచి భావనతో సీఎం పనిచేస్తున్నారన్నారు. కేసిఆర్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. వేద పండితులు, బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నామన్నారు.

హిందుధర్మ పరిరక్షణకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా చేసేందుకు కృషిచేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి హరీష్ రావు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, రమేష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు

Next Story