ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తా.. ఎంపీ పోటీపై కవిత సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తా.. ఎంపీ పోటీపై కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానన్నారు. శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత.. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అధ్యక్షుడు ఎక్కడినుండి పోటీ చేయమంటే అక్కడినుండి పోటీ చేస్తానన్నారు. ఈసారి అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తుందని 100 రోజుల తర్వాత కాంగ్రెస్ కు సినిమా చూపిస్తామన్నారు. తెల్లపూర్ లో గద్దర్ విగ్రహం వెనకాల రియల్ ఎస్టేట్ మాఫియా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనకాల ఎవరెవరూ ఉన్నారో త్వరలోనే తెలుస్తుందన్నారు. పూలే విగ్రహం వెనకాల బీసీల అభ్యున్నతి అంశం ఉందని వ్యాఖ్యానించారు.

కవిత వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి?:

లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి పోటీ చేయబోయే వారిపై జోరుగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ నింపాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లాంటి వారు పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండాలనే చర్చ జరుగుతుంటే కవిత విషయంలో మాత్రం మరో టాక్ వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను పోటీకి దింపడం ద్వారా పార్టీకి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనే టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది. ఇదే సమయంలో గతంలో పోటీ చేసిన నిజామాబాద్ కు కాదని మెదక్ స్థానం కోసం కవిత ప్రయత్నాలు చేస్తోందని ఈ విషయంలో కేసీఆర్ కుటుబంలో గొడవలు సైతం జరుగుతున్నాయని బీజేపీ నేత రఘునందన్ రావు బహిరంగంగానే ఆరోపించారు. కవిత స్థానచలనం తప్పదనే వాదన వినిపిస్తున్న వేళ తాను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధం అని కవిత వ్యాఖ్యానించడం చర్చనీయాశంగా మారింది. నిజంగానే కవిత నిజామాబాద్ ను వదిలేస్తున్నారా? లేక తనకు టికెట్ నిరాకరిస్తారేమోననే ఆందోళనతో రేస్ లో తానూ ఉన్నానని హింట్ ఇస్తున్నారా? అనేది సస్పెన్స్ గా మారింది.



Next Story

Most Viewed