యూట్యూబర్స్ కొత్త ఒరవడి.. గూగులమ్మకు యూట్యూబ్ బోనం

by Disha Web Desk 12 |
యూట్యూబర్స్ కొత్త ఒరవడి.. గూగులమ్మకు యూట్యూబ్ బోనం
X

దిశ, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలోని యూట్యూబర్స్ అంతా కలిసి బద్ది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. వందల సంఖ్యలో చేరుకున్న వారంతా కూడా తమకు ఉపాధి కల్పించిన గూగుల్ తల్లిని స్మరిస్తూ బోనం సమర్పించారు. వందల సంఖ్యలో వేములవాడ చేరుకున్న యూట్యూబర్స్, కళాకారులు అంతా కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. మాఘ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని యూట్యూబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కొంత సంప్రదాయానికి తెరలేపారు.

ఉపాధి లేక..

ఆధునిక పోకడల ప్రభావంతో తెలంగాణ జానపద కళాకారుల జీవనంలో ఒక్కసారిగా తిరోగమనంలో సాగడం ఆరంభించింది. అప్పటి వరకు తమ కళా ప్రదర్శనలతో ఉపాధి పొందుతూ జీవనం సాగించిన వారిని ఆదరించే వారు కరువయ్యారు. దీంతో చిన్నప్పటి నుంచి నమ్ముకున్న కళ తప్ప మరో దారి చూసుకోలేకపోయిన కళాకారులు తమ భవిష్యత్తు ఎలా అని మదన పడిపోయారు.

అదే సమయంలో యూట్యూబ్ వేదిక వారిని అక్కున చేర్చుకుంది. యూ ట్యూబ్ ద్వారా తమ కళా ప్రదర్శనలను సమాజానికి అందించడంతో గూగుల్ యాడ్ రెవెన్యూ అందిస్తోంది. దీంతో తమకు ఎంప్లాయిమెంట్ దొరికినట్టయిందని భావించిన కళాకారులు నెమ్మదిగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని జీవనం సాగించడం ఆరంభించారు.

దీంతో వ్యూస్ పెరగడం, సబ్ స్క్రైబర్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో నెమ్మదిగా కళాకారుల కష్టాలు గట్టెక్కాయి. కుటుంబాలను పోషించుకోవడం తో పాటు తమ ప్రదర్శనల ద్వారా వివిధ రకాల సాంకేతిక నిపుణులను, ఇతర కళాకారులకు కూడా ఉపాధి కల్పించే పరిస్థితి చేరుకున్నారు.

దీంతో తమ జీవన గమనాన్ని మార్చి ఉపాధి అవకాశాలను కల్పించిన గూగుల్ తల్లికి బోనాలు సమర్పించాలని యూట్యూబర్స్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిసెంబర్ 30న కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి గూగుల్ తల్లికి బోనాలు సమర్పిస్తామని కూడా ప్రకటించారు.

జోగినీలతో నేడు..

యూట్యూబర్స్ జోగినీలను కూడా వేములవాడకు రప్పించి బద్ది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. వందల సంఖ్యల వేములవాడకు చేరుకున్న వీరంతా బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక అమరవీరుల స్థూపం నుంచి బద్ది పోచమ్మ తల్లి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించిన యూట్యూబర్స్ ఆలయంలో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ప్రపంచంలోనే అరుదైన ఘటన..

యూట్యూబ్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి పొందుతున్నారు. కానీ ఉపాధి కల్పించేందుకు మార్గదర్శిగా నిలిచిన యూట్యూబ్ కు కానీ, గూగుల్ కు కానీ మొక్కులు తీర్చుకునే సంప్రదాయం మాత్రం ఎక్కడా నిర్వహించలేదు. కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో మాత్రమే ఈ అరుదైన జాతర జరిగింది. ఎక్కడ కనీవినీ ఎరగని కార్యక్రమానికి తెలంగాణ యూట్యూబర్స్ శ్రీకారం చుట్టి సరికొత్త ఒరవడి ప్రారంభించారు.


Next Story

Most Viewed