ప్రవీణ్‌రెడ్డి దారెటు..? కరీంనగర్ ఎంపీ టికెట్‌పైనే ఆశలు

by Disha Web Desk 1 |
ప్రవీణ్‌రెడ్డి దారెటు..? కరీంనగర్ ఎంపీ టికెట్‌పైనే ఆశలు
X

దిశ బ్యూరో, కరీంనగర్: హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి భవితవ్యం ఏమిటి అన్న విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది. మొన్నటి వరకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దాదాపు అన్ని వర్గాల ప్రజలు ప్రవీణ్ రెడ్డికి ఎంపీ సీటు వస్తుందని భావించి ఆయనకు అభినందనలు సైతం తెలిపారు. హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల ప్రభావితమే ఎక్కువగా ఉంటుంది. ప్రవీణ్ రెడ్డి రేవంత్ రెడ్డికి దగ్గరి పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో సైతం ఈసారి ఎంపీ సీటు కచ్చితంగా ప్రవీణ్ రెడ్డికి వస్తుందని అందరూ భావించారు.

ప్రవీణ్ రెడ్డి సైతం తనకి ఎంపీ టికెట్ వస్తుందని ప్రచారం సైతం మొదలు పెట్టారు. కానీ ఈ మధ్యన జరిగిన అనూహ్య పరిణామాలు కరీంనగర్ ఎంపీ టికెట్ విషయంలో ప్రజలను గందరగోళంలో పడేశాయి. రావు సామాజిక వర్గానికి చెందిన వినోద్ కుమార్ కు బీఆర్ఎస్ టికెట్టు ఇవ్వడంతో పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్లా, వేములవాడ నియోజక వర్గాల్లో వెలమ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉండి ప్రభావితం చేసే పరిస్థితి అధికంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ సైతం వెలమ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతుంది. పార్లమెంటు పరిధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో వారంతా ప్రవీణ్ రెడ్డికి కాదని వేలిచాల రాజేందర్ రావుకు ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.

దీంతో కరీంనగర్ టికెట్ విషయంలో అధిష్టానం కొలిక్కి రాకుండా హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. నలుగురు ఎమ్మెల్యేలు చెప్పిన వ్యక్తి కి కాకుండా తాము వేరే వ్యక్తికి ఇస్తే వారి సహకారం లేకుంటే ఎంపీ సీటు గల్లంతయ్యే అవకాశం ఉందని భావించి కరీంనగర్ పై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం టికెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ప్రవీణ్ రెడ్డి ఆశలు గల్లంతైనట్లేనని ఆయన అభిమానులు మదన పడుతున్నారు. మరోవైపు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన విషయం తెలిసిందే.

ఈ సీటును త్యాగం చేసిన ప్రవీణ్ రెడ్డి రేవంత్ రెడ్డి సహకారంతో భవిష్యత్తులో రెండో అధికార కేంద్రంగా మారితే తన ఉనికికి ప్రమాదం పొంచి ఉందని భావించి ప్రవీణ్ రెడ్డి విషయం లో అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతుంది. దీంతో అధిష్టానం ప్రవీణ్ రెడ్డి విషయంలో సీరియస్ గా నిర్ణయం తీసుకోవడం లేదని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో కరీంనగర్ సీటు విషయం కొలిక్కి రానున్న దృష్ట్యా ప్రవీణ్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఎంపీ సీట్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కరీంనగర్ లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోకుండా డైలమా లో ఉంచడంతో జనం అటు ఇటు అయ్యే అవకాశం ఉందని, కరీంనగర్ ఎంపీ సీటు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఒకవేళ ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకుంటే తర్వాత జరిగే పరిణామాలపై సైతం అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.


Next Story