రిజర్వేషన్లు రద్దు చేసే అధికారం అమిత్ షాకు ఎక్కడిది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 1 |
రిజర్వేషన్లు రద్దు చేసే అధికారం అమిత్ షాకు ఎక్కడిది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ముస్లింలు ఈ దేశ పౌరులు కదా అని ప్రశ్నించారు. స్థానిక ఇందిరా భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేసే అధికారం అమిత్ షాకు ఎక్కడిదంటూ, రిజర్వేషన్లు అనేవి మత ప్రాతిపదికన కాదని సామాజిక వెనుకబాటు తనం మీద కల్పించారనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

న్యాయస్థానం పరిశీలనలో ఉన్న రిజర్వేషన్ల అంశంపై అమిత్ షా వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. 60శాతం ఉన్న బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్ 40 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి హోదాలో రాష్ట్ర పర్యటనకు వచ్చి స్థానిక సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాల్సింది పోయి మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఆదివారం నాటి పర్యటన ఎన్నికల పర్యటనను తలపించిందన్నారు.

కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవాడనికే మత విద్వేషాలు సృష్టిస్తున్నారని రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యల వెనుక జాతిని విచ్ఛిన్నం చేసే కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఎంత సేపు రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని విమర్శిస్తున్న కేంద్ర మంత్రులు కేసీఆర్ అవినీతిని ఎందుకు బట్టబయలు చేయడం లేదో చెప్పలన్నారు. ఇకనైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారని నష్టపోయిన పంటలను పరిగణలోకి తీసుకుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు వాకిటి సత్యంరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపళ్లి దుర్గయ్య, జగిత్యాల రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు జున్ను రాజేందర్, నాయకులు నందయ్య, చాంద్ పాషా, మోయిజొద్దీన్, నేహాల్, రాధ కిషన్, మహిపాల్, రాజేష్, స్వామి రెడ్డి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed