ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మనకు అవసరమా..?

by Dishanational1 |
ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మనకు అవసరమా..?
X

దిశ, వెల్గటూర్: అరాచకాలు, అక్రమాలు, దోపిడీ విధానాలతోపాటు ల్యాండ్, స్యాండ్, లిక్కర్ మాఫియా కనుసన్నల్లోనే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాగిస్తున్న రాక్షస పాలనను అంతమొందించటమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు ముందుకు సాగాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ దోపిడీ విధానాలను ప్రజలకు వివరించేందుకే ప్రజాగోస బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని తీసుకుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కుటుంబ సభ్యులకు కోట్ల రూపాయల ఆస్తులను సీఎం కూడపెట్టారని విమర్శించారు. వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకుండా మొండి చేయి చూపారన్నారు. కొడుకు, బిడ్డ, సడ్డకుడు, అల్లుడుతోపాటు సీఎం వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మోడీ మూడున్నర కోట్ల ఇండ్లను పేద ప్రజల కోసం కట్టించి ఇచ్చారన్నారు. సీఎం ఎన్ని ఇండ్లు పేద ప్రజలకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను తాగుబోతులు చేసి కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో దోసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో నోట్ల మాయలో పడి ఓట్లు కారుకు వేసి మరోసారి గోసపడద్దన్నారు. టాక్స్ ల రూపంలో ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్న ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మనకు అవసరమా, రాబోయే ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబానికి తగిన బుద్ధి చెప్పి కంటికి కనబడకుండా తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకుండా యువత ఉసురు పోసుకుంటున్నాడని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలన్నారు. ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న సీఎం కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం, మండల అధ్యక్షులు చక్రపాణి, కొమ్ము రాంబాబు కాడే సూర్య నారాయణ, గుంత సంతోష్, రాజమల్లు, న్యాతరి మల్లేశం బండారి గంగాధర్ మంచె రాజేష్, పిల్లి శ్రీనివాస్, కస్తూరి సత్యం, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed