వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్షా : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 23 |
వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్షా : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: వచ్చే పార్లమెంటు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్షా లాంటివని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కేసీఆర్ స్వార్థ, ఆర్థికపరమైన ప్రయోజనం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో నిర్మాణ వ్యయాన్ని 40 వేల కోట్ల నుండి లక్ష ఇరవై వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కేసీఆర్ దోపిడీ అంతా మన కళ్ళ ముందు ఉన్న చరిత్ర అని వ్యాఖ్యానించారు. ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో రైతులు యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు.

కాబట్టే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని రాబోయే 10 ఏళ్లలో ఆ పార్టీ కనుమరుగు అవడం ఖాయమని జోస్యం చెప్పారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బిజెపి విదేశాలలో ఉన్న నల్లధనం తీసుకువచ్చి అందరి అకౌంట్లో వేస్తామని చెప్పడంతో పేద ప్రజలు నమ్మి ఓట్లు వేశారని మాట్లాడారు. రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడంలో బిఆర్ఎస్, బీజేపీ విఫలం అవడంతో కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి వివేక్ పార్టీలోకి వచ్చారన్నారు. తాను ఓడినా గెలిచిన సుదీర్ఘకాలంగా ప్రజా సేవలోనే ఉన్నానని కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలని కోరారు.

కేసీఆర్ మనీ లాండరింగ్ కేసులు పెట్టాలి : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

కమిషన్ల కొరకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ ఫ్యామిలీ పై మనీ లాండరింగ్ కేసులు పెట్టి విచారణ జరపాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చారని ఆరోపించారు. 10 ఏళ్ళు అహంకార ధోరణి తో కేసీఆర్ పాలించారని ఫోన్ ట్యాపింగ్ చేసి చట్టాన్ని అతిక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ తీసుకువచ్చారని కేంద్రం ఈ విషయంలో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కాం ద్వారా కవిత ఆమె కుటుంబం లబ్ది పొందిందని ఆరోపణలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు వచ్చే అవకాశం లేదని జోష్యం చెప్పారు.


Next Story

Most Viewed