ఇథనాల్ పరిశ్రమను సిరిసిల్లలో ఏర్పాటు చేసుకోండి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 1 |
ఇథనాల్ పరిశ్రమను సిరిసిల్లలో ఏర్పాటు చేసుకోండి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: సిరిసిల్లలో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తూ విష వాయువులు చిమ్మే ఇథనాల్ పరిశ్రమను మా దగ్గర ఏర్పాటు చేస్తారా.. అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం సిరిసిల్ల లో సైతం స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయకుండా వెల్గటూర్ మండలంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.

కాలుష్య ప్రభావిత పరిశ్రమ ఏర్పాటు చేసేటపుడు ప్రభావిత గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించడం తప్పనిసరి అని నిబంధనను మరిచి పరిశ్రమ ఏర్పాటుకి మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేయడం సరి కాదన్నారు. ఇథనాల్ పరిశ్రమ తమ ప్రాంతంలో ఏర్పాటు చేయోద్దని 20 రోజులుగా వెల్గటూర్ మండలం లోని పాషిగామ,వెంకటపూర్, స్తంభంపల్లి గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు.

వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పరిశ్రమ ఏర్పాటు కి భూమి పూజ చేయడమే కాకుండా ప్రజల తరపున ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు మీద మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను ఎందుకు ఒప్పించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లో 3వ టీఎంసీ పేరిట కోట్లాది విలువైన భూములను సేకరించారనా ఆరోపించారు. ఆ భూ నిర్వాసితులకు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించాలన్నారు.

ఇప్పటికైనా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటులో కొప్పుల ఈశ్వర్ భేషజాలకు పోకుండా వాస్తవాలను పరిగణలోకి తీసుకుని ఆ పరిశ్రమ స్థానంలో గతంలో నిర్మిస్తామన్న ఆసుపత్రి, గురుకుల కళాశాల నిర్మించాలని సూచించారు. వెల్గటూర్ లో ఎల్లంపల్లి జలాశయం అందుబాటులో ఉందని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్న టేస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మరి సిరిసిల్ల లో కూడా మిడ్ మానేర్ జలాశయం ఉందనే విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు.

పదవుల కోసం రైతులను ముంచిన నాయకుడు రవీందర్ రావు అని రైతులకు పంట రుణలపై 4 శాతం, దీర్ఘకాలిక రుణాలపై 6 శాతం రాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఇచ్చింది నిజమా కాదా అనేది రవీందర్ రావు చెప్పాలన్నారు. అవే రాయితీలు ఇప్పుడు ఇప్పించకపోతే టేస్కాబ్ చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూత పడిన షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చి తొమ్మిదేళ్లయినా అమలు చేయలేదన్నారు.

ఇపుడు కొత్తగా సహకార సంస్థ అధ్వర్యంలో చక్కెర ఫ్యాక్టరీను తిరిగి ప్రారంభిస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశం లో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, నాయకులు గాజుల రాజేందర్, ఎండీ మున్నా, చాంద్ పాషా, మహిపాల్, మారు గంగారెడ్డి, సర్పంచ్ లు శైలేంద్ర రెడ్డి, మురళి, వెల్గటూర్ మండల గ్రామస్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed