ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

by Disha Web Desk 1 |
ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, కోనరావుపేట : ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తిస్తూ.. అందరికీ అందుబాటులో ఉండాలని, సైబర్ నేరాలు, మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలపై గ్రామ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కోనరావుపేట మండల పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ సందర్శించి స్టేషన్ రికార్డులు, స్టేషన్ పరిసరాలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్.హెచ్.వో, లాక్ అప్, మెన్ రెస్ట్ రూం తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్ లో రోజువారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డులను ఆయన తనిఖీ చేశారు. గ్రామాల్లో మోనిటర్ కమిటీ ఆధ్వర్యంలో నిషేధిత గంజాయి, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

అదేవిధంగా పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లో ప్రజల కోసం పోలీసులు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెలలో నాలుగు సార్లు వేర్వేరు గ్రామాల్లో ఇన్ స్పెక్టర్, ఎస్.ఐ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారని తెలిపారు. యువత కోసం యాంటీ గాంజా డ్రైవ్ కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. ఐదు కేసులు నమోదు చేసి సుమారు నాలుగు కిలోల గాంజాయి పట్టుకొని సీజ్ చేశామన్నారు.

గాంజా అక్రమంగా రవాణా చేసినా.. సేవించినా.. చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పలు కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను అభినందించారు. తనిఖీల్లో డీఎస్సీ నాగేంద్ర చారి, సీఐ కిరణ్ కుమార్, ఎస్ఐ రమాకాంత్, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.



Next Story

Most Viewed