జీవితంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

by Disha Web Desk 1 |
జీవితంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
X

దిశ, గోదావరి ఖని : జీవితంలో మనకు వచ్చే ప్రతి అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ విద్యార్థినులకు సూచించారు. బుధవారం రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్ షిప్ లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన బాలికా సాధికారత మిషన్ -2023 ప్రారంభోత్సవ కార్యమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికా సాధికారత మిషన్ కార్యక్రమంలో తనను భాగస్వామి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 120 మంది బాలికలకు అదనపు నైపుణ్యాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరైతే అందులో చదువుతున్న విద్యార్థులలో 50 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు.

పూర్వం మైనింగ్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులను కేవలం అబ్బాయిలు మాత్రమే ఎంచుకునే వారని, ప్రస్తుత సంవత్సరం 12 మంది అమ్మాయిలు మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు ఎంపిక చేసుకున్నారని తెలిపారు. కష్టమైన సవాళ్లతో కూడిన రంగాల్లో సైతం మహిళలు పాల్గొంటూ రాణిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న అమ్మాయిలు చాలా మంది పేదరికం నుంచే వచ్చారని తెలిపారు.

అనంతరం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు అన్ని రంగాలపై అవగాహన కల్పించేలా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం సామాజిక బాధ్యత క్రింద గర్ల్స్ ఎంపవర్మెంట్ మిషన్-2023 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశించే పేద బాలికలకు ప్రయోజనకరంగా ఉండేందుకు పర్మనెంట్ టౌన్ షిప్ లో పాఠశాలలో శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. బాలికలకు చదువుతో పాటు శిక్షణ, భోజన వసతి కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఎన్టీపీసీ ప్రభావిత, పునరావాస గ్రామాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తి చేసిన 120మంది బాలికలను శిక్షణకు ఎంపిక చేశామన్నారు. వారికి నాలుగు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమం ముగిసే నాటికి టాప్ టెన్ లో ఉన్న బాలికలకు ఇంటర్ వరకు ఉచితంగా ఎన్.టీ.పీ.పీ.సీ నే విద్యను అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి, ఎన్టీపీసీ ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed