ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా జడ్జి ప్రతిమ

by Dishanational1 |
ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా జడ్జి ప్రతిమ
X

దిశ, కరీంనగర్ టౌన్: ఉద్యోగులుగా విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించడంతోపాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా జడ్జి బి. ప్రతిమ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి ప్రతిమ మాట్లాడుతూ, కోర్టు సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించడంతోపాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో సిబ్బంది మరియు వారి కుటుంబసభ్యులు కూడా ఓపీ మరియు ఇతర ఆరోగ్య పరీక్షలను నిర్వహించుకోవాలని, మెడికల్ క్యాంపు ద్వారా నిర్వహించిన రక్త పరీక్షల ఫలితాలను ప్రభుత్వ డయోగ్నస్టిక్ కేంద్రాలు పూర్తి ఉచితంగా ఆన్లైన్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కోర్టు సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోర్టు ప్రాంగణంలో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్న వైద్యసిబ్బంది అందరికి జడ్జి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు మెడికల్ క్యాంపులోని ప్రతీ విభాగాన్ని సందర్శించారు. అనంతరం వైద్య పరీక్షలను చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరి సుజయ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జువేరియా, స్పెషలిస్ట్ డాక్టర్లు అర్చన, హుమేరా ఫాతిమా, అంకిత్, అనుదీప్, గౌతమి, ఆదిత్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed