కేకే, కడియం చరిత్ర హీనులుగా మిగిలిపోతారు

by Disha Web Desk 15 |
కేకే, కడియం చరిత్ర హీనులుగా మిగిలిపోతారు
X

దిశ, కరీంనగర్ : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లపాటు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారిన కేశవరావు, కడియం శ్రీహరి చరిత్ర హీనులుగా మిగిలి కాలగర్భంలో కలిసిపోతారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడియం కేకే 200 కోట్లకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఏద్దేవా చేశారు. పార్టీ మారడం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టే అన్నారు. కేకే, కడియంను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే కేసీఆర్ వారికి పార్టీలో సముచితమైన పదవులు కట్టబెట్టి పునర్జన్మ ప్రసాదించారన్నారు. పార్టీలో కేటీఆర్, హరీష్ రావుతో సమానంగా వారికి పార్టీలో గౌరవం ఇచ్చామని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన నాయకత్వం ఉంటుందని పేర్కొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పార్లమెంట్ అభ్యర్థుల కొరత ఉన్నందున బీఆర్ఎస్ పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి కడియం కూతురుకు పార్లమెంట్ టికెట్ ఖరారు చేసినా, కేకే కూతురుకు మేయర్ పదవి కట్టబెట్టినా పార్టీ మారడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్లిద్దరూ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు పోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఓవైపు మోడీ బడే భాయ్ అంటూ మరోవైపు తెలంగాణను ఆంధ్రాలో కలిపే దిశగా చంద్రబాబు నాయుడుతో మంతనాలు చేపడుతున్నారని, ప్రజలు దీన్ని గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నతంగా ఆలోచించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రజలకు సాగు, తాగునీరు అందించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంతో పాటు కరువును కూడా వెంట తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చల్లహరి శంకర్, కులదీప్ నాయర్, పొన్నం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed