ప్రమాదం జరిగితే కారకులెవరు..!.. కనీస చర్యలకు సాహసించని అధికారులు

by Disha Web Desk 23 |
ప్రమాదం జరిగితే కారకులెవరు..!.. కనీస చర్యలకు సాహసించని అధికారులు
X

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ట్రేడ్ లైసెన్స్, తాత్కాలిక అనుమతులతో నగదు వసూలు చేస్తూ అధికారులు విచ్చలవిడిగా అనుమతులు జారీ చేస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాల్సిన అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ అధికారులు మామూళ్ల మత్తులో రూల్స్ కు విరుద్ధంగా అనుమతులు ఇస్తుండటం పరిపాటిగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వాలంటే అన్ని నిబంధనలు పాటించాలని చట్టం చెబుతోంది.

కానీ నర్సంపేట పట్టణంలో అవేమీ అమలు జరగని పరిస్థితి నెలకొంది. అనుమతి ఇచ్చాక నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని ఆలోచన చేయడం అధికారులు పనితీరుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. గత రాత్రి వరంగల్ లోని జకోటియా కాంప్లెక్స్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగిన సంగతి విధితమే. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగితే మంటలను అదుపులోకి తీసుకురావడానికి గంటల సమయం పట్టింది. చుట్టూ భవనాలు లేకున్నా, అదుపు చేసే క్రమంలో ఇద్దరు పోలీసులు సైతం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నర్సంపేట పట్టణంలోని బస్టాండ్ దగ్గరలోని మసీదు సమీపంలో ఇరుకుగా ఉన్న ప్రాంతంలో ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో నిత్యం చికిత్స కోసం వచ్చే ప్రజలు అధికం.

ఈ నేపథ్యంలో పొరపాటున ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డకు ఆస్పత్రుల భవనాలకు నిడివి తక్కువగా ఉండటం వల్ల అనుకోని పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. దీనిపై అధికారుల దృష్టి లేకపోవడం విచారకరం. మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న సంగతి పట్ల పట్టింపు లేకపోవడం ప్రజల ప్రాణాల పట్ల అధికారుల తీరును స్పష్టం చేస్తోంది.

నామ మాత్రంగా నోటీసుల జారీ..

ఈ నెల 23న దిశ దిన పత్రికలో ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఏది..! అనే శీర్షికతో ఒక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏ నేపథ్యంలో స్పందించిన మున్సిపల్, ఫైర్ అధికారులు నర్సంపేట పట్టణంలోని ఆస్పత్రులకు, షాపింగ్ కాంప్లెక్స్ లకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాగా ప్రజల ప్రాణాల పట్ల శ్రద్ధ వహించాల్సిన ఫైర్, మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపు కున్నట్లు విమర్శలు మొదలయ్యాయి. అనుమతులు ఇవ్వాల్సిన సమయంలో చూసీచూడనట్లు వ్యవహరించి అనుమతులు మంజూరు చేసిన అధికారులు ఇప్పుడు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఖాతరు చేయని ఆస్పత్రులు..

నర్సంపేట పట్టణంలో గత రెండు మూడు ఏండ్ల నుంచి ఆసుపత్రుల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. అనుమతి ఇచ్చే ముందు అన్ని అర్హతలు పాటిస్తున్నారా లేదా అని వాకబు చేసి అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు అవినీతికి పెద్ద పీట పీట వేస్తూ విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సదరు భవనాల యజమానుల నుంచి వసూలు చేశారన్న వాదనలు బలంగా ఉన్నాయి. గతేడాది హైదరాబాద్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న అనంతరం తీరిగ్గా మేలుకున్న అధికారులు హుటాహుటిన నర్సంపేటలోని ఆస్పత్రులకు, షాపింగ్ కాంప్లెక్స్ లకు ఫైర్ సేఫ్టీ కి సంబంధించి గత ఏడాది ఏప్రిల్ లో నోటీసులు జారీ చేశారు. ఈ సంఖ్య దాదాపు 40 కి పైగా ఉన్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన వివరాలేవీ ఇరు శాఖల వద్ద లేకపోవడం వీరి నిర్లక్ష్యానికి కొసమెరుపు.

కాగా ఈ ఏడాది సైతం అదే సంఖ్యలో నోటీసులు జారీ చేశామనడం గమనార్హం. ఏడాది కాలంగా ఏ ఒక్కరూ నిబంధనలు పాటించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే అధికారులకు ఎప్పటికప్పుడు వాటా వెళ్తుండటంతో ఎవరూ దీన్ని ప్రశ్నించే సాహసం చేయట్లేదన్న భిన్న వాదనలు ఉన్నాయి. తాజాగా దిశ కథనంతో మరోసారి ఫైర్ సేఫ్టీ అంశం వెలుగులోకి రావడంతో మరోసారి కేవలం నోటీసులు జారీ చేసిన మున్సిపల్, ఫైర్ అధికారులు చేతులు దులుపు కున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు


Next Story