రోజురోజుకు ఆక్రమణకు గురవుతున్న గంగోనికుంట

by Disha Web Desk 12 |
రోజురోజుకు ఆక్రమణకు గురవుతున్న గంగోనికుంట
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో ఆక్రమణలకు అంతే లేకుండా పోయింది. ఖాళీ స్థలాలు, కుంటలు, రోడ్లు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇవి సరిపోవడం లేదని పట్టణంలోని గంగోనికుంట స్థలంపై కన్నేసి కబ్జా చేస్తున్నారు కొందరు ఆక్రమణదారులు. కుంట మధ్యలోకి చొచ్చుకొని వచ్చి బండరాళ్లు, మట్టి నింపుతున్న అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదు. అసలు అధికారులు ఉన్నట్టా.. లేనట్టా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని రజకవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గంగోనుకుంట 2477 సర్వే నంబర్‌లో 12 ఎకరాల 16గుంటల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుతం ఈ స్థలం ఐదు ఎకరాలకే పరిమితమైంది.

గంగోనికుంటా స్థలానికి హద్దులు నిర్ణయించాలని పరిసర ప్రాంతాల ప్రజలు గత కొన్నేళ్లుగా అధికారులను కోరుతున్నారు. అయినా అధికారులు దీనిపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సామాన్యుడు ఎక్కడైనా భూమి ఆక్రమిస్తే ఆగమేఘాల మీద సర్వేలు చేసి కేసులు నమోదు చేస్తున్న రెవెన్యూ అధికారులు ఈ స్థలం కబ్జా పై మౌనంగా ఉండడంలో అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కుంట శిఖంలోని స్థలాన్ని దాదాపు 10 గుంటల వరకు బండ రాళ్లు, మట్టితో నింపుతూ కబ్జా చేస్తున్నారు. ఈ స్థలం విలువ దాదాపు రూ.80 లక్షల వరకు ఉంటుంది.

తెరవెనుక అధికారుల అండదండలతో..

అయితే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తెరవెనుక సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగోనికుంట పరిసర ప్రాంతాల్లో 2478, 2489, 2480, 2483, 2484, 2485, 2486, 2487 సర్వే నంబర్లలో భూములు కలిగిన వారు కుంట భూమిలోకి చొచ్చుకొచ్చి కొందరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కుంట ఇది 60 శాతం వరకు కబ్జాకు గురైంది. అందులో ఇప్పటికే కొందరు అక్రమార్కులు గృహాలు నిర్మించుకున్నారు. ఇది చాలదన్నట్టు నీరు నిలువ ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేసి మట్టితో నింపుతున్నారు. అయినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తెరవెనుక సహకరిస్తున్నారని ఆరోపణలు వినివస్తున్నాయి.

గంగోనికుంట స్థలం కబ్జా చేస్తున్న ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నివాసం ఉంటున్న కొందరు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో చలనం లేదని, పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు, రాత్రిళ్లు టిప్పర్లతో రాళ్లను, మట్టిని కుంటలోకి తరలిస్తూ బ్లేడ్ బండి సహాయంతో చదును చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే గంగోని కుంట స్థలాన్ని దర్జాగా కబ్జా చేస్తూ ఈ తతంగమంతా నడిపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుంట స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

విచ్చలవిడిగా ధ్వంసం..

ఇప్పటికే పట్టణంలోని గంగోనుకుంట స్థలాన్ని విచ్చలవిడిగా ధ్వంసం చేశారు. దశాబ్దాల చరిత్ర గలిగిన గంగోనుకుంటను ఇప్పటికే ఆనవాళ్లు లేకుండా చేశారు. కుంట శిఖాన్ని ఇప్పటికే ప్లాట్లుగా చేసి గృహాలు నిర్మించుకున్నారు. లోతట్టు ప్రాంతాన్ని మట్టితో నింపి గృహాలు నిర్మించుకున్నారు. ఈ కుంటలోకి నీరు చేరకుండా ధ్వంసం చేస్తున్నారు.

చర్యలు తీసుకోవాలి : రాజూరి ప్రశాంత్

కొన్నేళ్ల కిందట నిర్మించిన గంగోనికుంటను అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం ఈ కుంటను రక్షించేలా చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులు కుంటలోకి నింపిన రాళ్లను, మట్టిని తొలగించాలి. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.

హద్దులు నిర్ణయించాలి : పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

గంగోనికుంట శివారును సర్వే నిర్వహించి హద్దు రాళ్లు పెట్టాలి. పరిసర ప్రాంతాల సర్వే నంబర్లు ఉన్న వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వివిధ పార్టీల నాయకులు కబ్జాలు చేసి ప్లాట్లుగా విక్రయించారు. అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను వెంటనే తొలగించాలి.


Next Story