కోరుట్ల బీఆర్ఎస్‌లో తండ్రి vs కొడుకు

by Disha Web Desk 12 |
కోరుట్ల బీఆర్ఎస్‌లో తండ్రి vs కొడుకు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఐదు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఎలక్షన్ ఇయర్ కావడంతో టికెట్ రేసులో ఉన్న ఆశావహులు ఇప్పటికే ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారి మధ్య టికెట్ విషయంలో పోటీ నెలకొనే అవకాశం ఉంది. మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొన్నది. కోరుట్లలో ఎమ్మెల్యే టికెట్ విషయంలో తండ్రీ కొడుకుల మధ్యనే పోటీ ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఆయన తనయుడు డాక్టర్ సంజయ్ కుమార్ కోరుట్ల నుంచి బరిలో ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాత్రం ఇంకోసారి పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండటంతో తనయుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏది కలిసొచ్చే అంశం..?

తనయుడి పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. తనయుడు సంజయ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది..? ఎవరు బరిలో ఉంటే గెలుస్తారనే విషయంలో ఎటు తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సంజయ్ కుమార్ ఇటీవల కాలంలో నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినా వివిధ అధికారిక, అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాజకీయాల్లో తన మార్క్ చూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీలోని కొంతమంది సీనియర్లను సంజయ్ సరిగా పట్టించుకోవడం లేదని యంగ్ లీడర్ కావడంతో ఎక్కువగా యూత్ వైపే మొగ్గు చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

నియోజకవర్గంలోని సర్పంచులకే ఎక్కువ ప్రాధాన్యతిస్తూ ఎంపీటీసీలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ముఖ్యఅనుచరులుగా పేరు ఉన్న కొంతమంది నాయకులు నాలుగోసారి కూడా ఆయనే పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఎమ్మెల్యే మాత్రం పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారని, అందులో భాగంగానే సంజయ్ కుమార్‌ను కోరుట్ల బరిలో ఉంచాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలోని మరో వర్గం భావిస్తోంది. ఇక మరోవైపు కల్వకుంట్ల సంజయ్ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుడు కావడంతో ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రెండు వర్గాలుగా క్యాడర్..

బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న కోరుట్లలో పార్టీ క్యాడర్ రెండుగా వర్గాలుగా మారినట్లు తెలుస్తోంది. అంతర్గతంగా ఎటువంటి విబేధాలు లేకపోయినా ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో మాత్రం పార్టీలో కొంతమేర విబేధాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా టీటీడీ బోర్డు మెంబర్‌తోపాటు ఖాది భండార్ చైర్మన్‌గా అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఈసారి పోటీ చేసిగెలిస్తే ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్లు మాత్రం ఔట్ రైట్‌గా మళ్లీ విద్యాసాగర్ రావు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్తుండగా యూత్ లీడర్లు మాత్రం సంజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రీ తనయుల్లో ఎవరు కాంప్రమైజ్ అవుతారు.. ఎవరు బరిలో ఉంటారనేది తెలియాల్సి ఉంది.

ప్రతిపక్షాల టార్గెట్?

మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర్ రావు ఇమేజ్‌ను ఆయన తనయుడు సంజయ్ క్యాచ్ చేయలేరని ప్రతిపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. సంజయ్ కుమార్‌కు టికెట్ కన్ఫామ్ అయితే అధికార పార్టీలోని అసమ్మతి వర్గాన్ని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేరదీసే అవకాశం ఉంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన విద్యాసాగర్ రావు బరిలో లేకపోతేనే తమకు ప్లస్ అవుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా యంగ్ లీడర్, డాక్టర్ అయిన సంజయ్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడని, కేటీఆర్‌కు సన్నిహితుడనే పేరుండడంతో సంజయ్ గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని పార్టీలోని సెకండ్ క్యాడర్ భావిస్తోంది. దీంతో కోరుట్ల నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.


Next Story

Most Viewed