అస్తవ్యస్తంగా మారిన డంపింగ్ యార్డులు

by Disha Web Desk 23 |
అస్తవ్యస్తంగా మారిన డంపింగ్ యార్డులు
X

దిశ,సైదాపూర్ : పల్లెల్లో పరిశుభ్రత కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీకి లక్షలు వెచ్చిస్తోంది. చెత్తను సేకరించడానికి ట్రాక్టర్ తో పాటు డంపింగ్ యార్డులను నిర్మించింది. అక్కడే తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారీ కోసం ప్రత్యేకంగా డంపింగ్ యార్డులను నిర్మించింది. ట్రాక్టర్ల ద్వారా చెత్త డంపింగ్ యార్డ్ కు చేరుతున్నప్పటికీ ఎక్కడ తడి, పొడిగా వేరు చేయడం లేదు. నిర్వహణ లేక సెరిగ్రేషన్ షెడ్లు అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతుంది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలకు ప్రత్యామ్నాయమ ఆదాయ వనరుగా మండలంలో కోట్లు వెచ్చించి పంచాయితీల్లో డంపింగ్ యార్డులు నిర్మించారు. ఆర్భాటంగా నిర్మించిన అధికారులు వినియోగంపై శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో 80 శాతానికి పైగా గ్రామాల్లో తడి, పొడి వ్యర్ధాలను విభజించే ప్రక్రియ కనిపించడం లేదు.

సిబ్బంది అవసరం

ఇంటింటా చెత్త సేకరిస్తున్న సమయంలో యజమానులు తడి, పొడి చెత్తను వేరు వేరు డబ్బాలో ఇవ్వకుండా ఒకే దాంట్లో వేసి ఇస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ లో ఒకే కుప్పగా పోస్తున్నారు. ఇదే సమయంలో అవగాహన ఉన్న కొందరు వేరువేరుగా ఇస్తున్నప్పటికీ సిబ్బంది అదే డబ్బాలో పోస్తున్నారు. సేకరించిన చెత్తను సెరిగ్రేషన్ షెడ్డు ప్రాంతంలో పారబోసి వెళ్తున్నారు. వాస్తవానికి షెడ్డుకు తీసుకు వచ్చిన తర్వాత విభాగాల వారీగా పేర్లతో సూచించిన డబ్బాల మాదిరిగా ఉన్న నిర్మాణాల్లో జాగ్రత్తగా వేయాలి. కానీ వేరు చేయడానికి ప్రత్యేక సిబ్బంది లేకపోవడం కూడా సమస్యగా మారింది.

ప్రజలకు అవగాహన కల్పించి తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువులను తయారు చేయడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మండలం లో కొన్ని గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తుండగా మరికొన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డ్ లకు తరలించకుండా రోడ్లపై, ఇతర ప్రాంతాల్లో పారబోసి చేతులు దులుపుకుంటున్నారు. కొన్నిసార్లు డంపింగ్ యార్డ్ లో వేసిన చెత్తను, రోడ్లపై వదిలిన చెత్తకు నిప్పంటించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సెరిగ్రేషన్ షెడ్డు నిరుపయోగంగా మారింది. కొన్ని గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డ్ కు తీసుకు వెళ్లడం లేదు. అలాగే ఎరువులు తయారు చేసిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపించడం లేదు.

పంచాయతీలదే బాధ్యత

ఇంటింటా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకెళ్లిన అనంతరం సెరిగ్రేషన్ షెడ్డులో తడి, పొడి రకాలను వేరు చేయాలి. తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి వాటిని రైతులకు విక్రయిస్తే పంచాయతీకి అదనంగా ఆదాయం వస్తుంది. దాని నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీ సిబ్బందిదే.


Next Story